దివంగత కృష్ణంరాజు విగ్రహాన్ని ఫైబర్‌తో రూపొందించిన శిల్పి ..

రెబెల్ స్టార్ కృష్ణం రాజు సెప్టెంబర్ 11న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కృష్ణం రాజు మరణ వార్త యావత్ సినీ లోకాన్నే కాదు రాజకీయ నేతలను సైతం షాక్ కు గురి చేసింది. కృష్ణం రాజు ఇక లేరు అనేది ఎవరు కూడా జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ క్రమంలో ఫైబర్‌తో కృష్ణంరాజు విగ్రహాన్ని రూపొందించి తన అభిమానాన్ని చాటుకున్నాడు ఓ శిల్పి. ఈ విగ్రహాన్ని శనివారం ఒంగోలులో నిర్వహించిన ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు. సృష్టి ఆర్ట్‌ అకాడమీ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ భవన్‌లో జాతీయ చిత్ర కళా ప్రదర్శన నిర్వహించారు.

ఇందులో ప్రదర్శించిన కృష్ణంరాజు విగ్రహంప్రత్యేక ఆకర్షణగా నిలించింది. సాక్షాత్తు కృష్ణంరాజే వేదికపై నిల్చున్న అనుభూతి చూపరులకు కలిగింది. దీంతో పలువురు విగ్రహం పక్కన నిలబడి ఫొటోలు తీసుకుని అభిమానులు సంబరపడ్డారు. కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన కృష్ణ అనే శిల్పి.. ప్రభాస్‌పై ఉన్న అభిమానంతో కృష్ణంరాజు విగ్రహాన్ని రూపొందించినట్టు తెలిపారు. ఇందుకుగాను దాదాపు 30 రోజులపాటు శ్రమించినట్టు చెప్పుకొచ్చారు. విగ్రహాన్ని త్వరలోనే ప్రభాస్‌కు కానుకగా అందజేస్తానని తెలిపారు.