కాకినాడ ఘటనపై సీఎం జగన్ సీరియస్

కాకినాడ లో శనివారం దారుణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రేమ పేరుతో ఓ యువతిని కొంతకాలంగా వేధిస్తున్న ప్రేమోన్మాది శనివారం ఆమె స్కూటీపై వెళ్తుండగా హతమార్చాడు. వేటకొడవలితో నరికి నరికి చంపాడు. ఈ ఘటన ఫై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. దిశ చట్టం ప్రకారం నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. నేరం చేసిన వ్యక్తికి కఠిన శిక్ష పడేలా తగిన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. యువతి కుటుంబ సభ్యులను.. ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. మహిళా కమిషన్ తరఫున మృతురాలి కుటుంబాన్ని ఆదుకుంటామని తెలిపారు.

కాకినాడ జిల్లాలోని కాండ్రేగుల కూరాడ గ్రామంలో దేవకి అనే యువతిని సూర్యనారాయణ అనే యువకుడు ప్రేమ పేరుతో కొంతకాలంగా వేధిస్తున్నాడు. తనను ప్రేమించాలని వెంటపడుతున్నాడు. దీనికి ఆమె నిరాకరించింది. అయినా ఆమెను వదిలిపెట్టలేదు. ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఆమెను ఇబ్బందిపెడుతూ వస్తున్నాడు. ఆమె కుటుంబసభ్యులు కూడా అడ్డుచెప్పారు. అయినా ప్రేమోన్మాది సత్యనారాయణ వదిలిపెట్టలేదు. చివరికి ఆమెను ఎలాగైనా అంతమొందించాలని ప్లాన్ చేశాడు.

శనివారం దేవకీ గ్రామంలో స్కూటీపై వెళ్తుండగా అకస్మాత్తుగా వేటకొడవలితో దాడి చేశాడు. ఆమె మెడభాగంగా నరికేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన దేవకిని గ్రామస్తులు ఆస్పత్రికి తరలించి కాపాడే ప్రయత్నం చేసినా బతకలేదు. వెంటనే స్పందించిన పోలీసులు ఘటనా స్ధలికి చేరుకుని ప్రేమోన్మాదిని అదుపులోకి తీసుకున్నారు.