రేపు కొత్తగూడెం బంద్‌కు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల పిలుపు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రామకృష్ణ అనే వ్యక్తి తన కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆత్మహత్య కేసులో నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ రేపు శుక్రవారం కొత్తగూడెం బంద్‌కు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల పిలుపునిచ్చాయి. ఈ కేసుకు సంబదించిన రోజుకో విషయం బయటపడుతుంది. తాజాగా రామకృష్ణ సెల్ఫీ వీడియో బయటపడడం..అందులో రామకృష్ణ సంచలన విషయాలు బయటపెట్టారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవ తన భార్య గురించి అసభ్యంగా మాట్లాడాడని రామకృష్ణ తెలిపాడు.

ఆత్మహత్య నిర్ణయానికి దారి తీసిన పరిస్థితులను ఆ వీడియోలో రామకృష్ణ వివరించారు. ‘‘రాఘవ కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి. వనమా రాఘవ దురాగతాలతో ప్రజలు ఎలా బతకాలి. అతని లాంటి దుర్మార్గులను రాజకీయంగా ఎదగనివ్వొద్దు. డబ్బు రూపంలో అడిగినా ఇచ్చేవాడిని. కానీ ఏ భర్త కూడా వినగూడని మాట వనమా రాఘవ అడిగారు. నా భార్యను హైదరాబాద్ తీసుకురావాలని అడిగారు. రాజకీయ, ఆర్ధిక బలంతో పబ్బం గడుపుకోవాలని చూశారు.నేను ఒక్కడినే చనిపోతే నా భార్య, పిల్లలను వదిలిపెట్టరు. అందుకే నాతో పాటు నా భార్యాపిల్లల్ని తీసుకెళ్తున్నాను. అప్పుల్లో ఉన్న నాపై నా తల్లి, సోదరి కక్ష సాధించారు. నేను వీళ్లందరితో పోరాటం చేసే స్థితిలో లేను. నా తండ్రి ద్వారా వచ్చే ఆస్తితో నా అప్పులు తీర్చాలి. నాకు సహకారం అందించిన అందరికీ న్యాయం చేయాలి.” అని అన్నారు.

ఇదిలా ఉంటె ఈ ఘటన పట్ల రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎమ్మెల్యే వనమాను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్ చేశారు. రాఘవ దారుణాన్ని తట్టుకోలేకే రామకృష్ణ ఆత్మహత్య చేసుకున్నారని, వనమా రాఘవను వెంటనే అరెస్ట్‌ చేయాలన్నారు. మానవ మృగానికి టీఆర్ఎస్ వత్తాసుగా నిలవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కుమారుడు ఇన్నీ అరాచకాలు చేస్తుంటే సీఎంకు తెలియదా?..తెలంగాణ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోందని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. వనమా రాఘవ మాఫియాను మించిపోయారని, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.