మాజీ ముఖ్య‌మంత్రి రోశ‌య్య మృతి..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (89) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఈరోజు ఉద‌యం ఒక్క సారి గా బీపీ డౌన్ కావడం తో రోశ‌య్య‌ను కుటుంబ సభ్యులు హైద‌రాబాద్ లోని స్టార్ ఆస్పత్రికి తరలించారు. అయితే…. ఆస్పత్రికి వెళ్లగానే రోశయ్య చనిపోయినట్లుగా నిర్ధారించారు వైద్యులు.

కొణిజేటి రోశయ్య 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామములో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్ అభ్యసించారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వములో రోడ్డు రహదార్లు శాఖ, రవాణ శాఖల మంత్రిగా పనిచేశారు.

రోశయ్య 2004లో ప్రకాశం జిల్లా చీరాల నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికలలో పోటీచేయకుండా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలిలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఉంది. రోశయ్య 2009 సెప్టెంబర్ 3 నుంచి 2010 నవంబరు 24 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2011 ఆగస్టు 31న రోశయ్య తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా బాధ్యతలు నిర్వహించారు. 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నరుగా తన సేవలు అందించారు.

రోశయ్య మృతిఫై రాజ‌కీయ ప్ర‌ముఖులు, అభిమానులు సంతాపం తెలిపుతున్నారు. రేపు ఆయ‌న అంత్య క్రియ‌లు జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.