జీహెచ్​ఎంసీలో పెరుగుతున్న కరోనా కేసులు..మళ్లీ పల్లె బాట పట్టాల్సిందేనా..?

జీహెచ్​ఎంసీలో పెరుగుతున్న కరోనా కేసులు..మళ్లీ పల్లె బాట పట్టాల్సిందేనా..?

కరోనా మహమ్మారి రెండేళ్లుగా ప్రజలను వదిలిపెట్టడంలేదు. రూపు మార్చుకుంటూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటుంది. కరోనా కోరల నుంచి బయపడుతున్నామని సంబరపడే లోపే ఇప్పుడు ఒమిక్రాన్‌గా రూపాంతరం చెంది మరోమారు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు బయటపడక పోయినా విదేశాల నుంచి ఇటీవల వచ్చిన ఓ మహిళకు పాజిటివ్ అని తేలింది. మొన్నటి వరకు రాష్ట్రంలో కరోనా కేసులు బయటపడలేదని అనుకున్నారో లేదో..ఇప్పుడు ప్రతి రోజు వందల కేసులు బయటపడుతున్నాయి.

ఇక జీహెచ్​ఎంసీలోను మళ్లీ కరోనా కేసులు..పెరుగుతుండడంతో నగరవాసులు ఖంగారుపడుతున్నారు. మళ్లీ పల్లె బాట పట్టాల్సిందేనా అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ప్రస్తుతం జీహెచ్​ఎంసీ పరిధిలో రోజుకు సుమారు 70 నుంచి 80 వరకు కరోనా కేసులు వస్తున్నాయి. రంగారెడ్డిలో 15 , మేడ్చల్ జిల్లాలో 20 వరకు కేసులు నమోదవుతున్నాయి. కరోనా ఫస్ట్ వేవ్ , సెకండ్ వేవ్ టైం లో కూడా చాలామంది హైదరాబాద్ ను వదిలి సొంతఊర్లకు వెళ్లడం జరిగింది. కరోనా తగ్గగానే మళ్లీ హైదరాబాద్ కు వచ్చారు. ఇప్పుడు మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడం..కొత్తగా ఒమిక్రాన్ వైరస్ బయటకు రావడం తో నగరవాసులు వణికిపోతున్నారు.

మరోపక్క కరోనా తగ్గడం తో చాలామంది మాస్క్ లు ధరించడం మరచిపోయారు. 60 శాతం మంది మాస్కులు సరిగ్గా ధరించటం లేదని వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. కొత్త కేసులు బయటపడుతుండడం మాస్కులు లేకుండా బయటకు వచ్చే వారికి వెయ్యి జరిమానా విధించాలని వైద్యారోగ్య శాఖ పోలీస్‌ శాఖకు సూచించింది.