జూన్ తర్వాత కరోనా ఫోర్త్ వేవ్ : కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి

ఐఐటీ కాన్పూరు నిపుణులు ఇచ్చిన నివేదిక వివరాలు వెెల్లడించిన మంత్రి

బెంగళూర్: కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ కరోనా కేసుల పెరుగుదలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో కరోనా ఫోర్త్ వేవ్ జూన్ తర్వాత గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని, అక్టోబరు వరకు దాని ప్రభావం ఉంటుందని కాన్పూరు ఐఐటీ నిపుణులు అంచనా వేశారని చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరు వ్యాక్సిన్లు వేయించుకోవాలని, మాస్కులు ధరించడంతోపాటు ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని సూచించారు. బెంగళూరులో నిన్న విలేకరులతో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

కాన్పూరు ఐఐటీ పరిశోధకులు ఇచ్చిన నివేదికలోని విషయాలను మంత్రి వెల్లడించారు. దీని ప్రకారం.. రాష్ట్రంలో జూన్ చివరలో కరోనా ఫోర్త్ వేవ్ ప్రారంభమై ఆ తర్వాత గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. ఈ ప్రభావం సెప్టెంబరు నుంచి అక్టోబరు వరకు కొనసాగే అవకాశం ఉంది.

కరోనాపై కాన్పూరు ఐఐటీ శాస్త్రవేత్తలు వేసిన అంచనాలు నిజమయ్యాయని, కాబట్టి తాజా నివేదికలోని అంశాలు కూడా నిజమయ్యే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మునుపటిలా జాగ్రత్తగా ఉండాలని, వ్యాక్సిన్లు వేయించుకోవాలని, మాస్క్ తప్పకుండా ధరించాలని, భౌతికదూరం పాటించాలని, శానిటైజర్లు ఉపయోగించాలని మంత్రి సూచించారు. అలాగే, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటకలో కొవిడ్ నాలుగో దశ కేసులు స్వల్పంగా ఉన్నట్టు తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/