అమరావతి ప్రజలపై చంద్రబాబుకు ప్రేమ లేదు – కొడాలి నాని

టీడీపీ అధినేత చంద్రబాబు కు అమరావతి ప్రజలపై ప్రేమ లేదు..అక్కడ ఉన్న ఆస్తులపై ప్రేమ ఉందన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. విశాఖ గర్జన లో పాల్గొన్న నాని..చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లపై నిప్పులు చెరిగారు. బాబు స్వార్థపూరిత ఆలోచనలు సమర్థిస్తున్న రాజకీయ పార్టీలు, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రయోజనాలకు దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే ఖబడ్దార్‌ అంటూ హెచ్చరించారు. అమరావతి రాజధానిని గ్రాఫిక్స్ లో చంద్రబాబు చూపించారు. విశాఖ రాజధాని కావాలని అంతా కోరుకోవాలి… ఒక్క అమరావతిలోనే టీడీపీ ఉందా? అని ప్రశ్నించారు. టీడీపీ, జనసేనను ఉత్తరాంధ్ర ప్రజలు బ్యాన్ చేయాలని డిమాండ్‌ చేశారు.

నారా లోకేష్‌ భవిష్యత్‌ కోసం, అమరావతిలో ఉన్న భూముల ఆస్తుల విలువ పెంచుకునేందుకు ఒకే ప్రాంతంలో లక్షన్నర కోట్లతో అభివృద్ధి చేయాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతోనే సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారన్నారు. రాబోయే తరాల్లో ప్రాంతీయ విద్వేషాలు రాకూడదు. ఒక ప్రాంతం అభివృద్ధి చెంది, మిగతా ప్రాంతాలు వెనుకబడి ఉంటే మా ప్రాంతం నుంచి వెళ్లిపోండి అంటూ ప్రత్యేక ఉద్యమాలు వచ్చే అవకాశం వస్తుంది. ఈ రాష్ట్ర సంపదతో ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన తరువాత అక్కడి నుంచి మరో ప్రాంత ప్రజలను వెళ్లగొడితే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు వస్తాయి. ఈ రోజు ఏపీలో అందరం కూడా ఏరకమైన బాధలు అనుభవిస్తున్నామో..అలాంటి బాధలు వచ్చే తరాలు అనుభవించకూడదనే సీఎం జగన్‌ మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పి..విశాఖను పరిపాలన రాజధాని, కర్నూలును జ్యుడిషియల్‌ రాజధాని, అమరావతిని శాసన రాజధానిగా చేయాలని భావించారని నాని అన్నారు.