పవన్ కు అన్నింటికీ వైజాగ్ కావాలి..పరిపాలన కేంద్రం మాత్రం వద్దు – మంత్రి రోజా

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పెళ్లి చేసుకోవడానికి వైజాగ్ అమ్మాయి కావాలి.. షూటింగ్ లు చేసుకోవడానికి వైజాగ్ కావాలి.. సినిమా కలెక్షన్లకు, నటన నేర్చుకోవడానికి వైజాగ్ కావాలి.. చివరికి ఆయన పోటీ చేయడానికి గాజువాక కావాలి. కానీ వైజాగ్ లో పరిపాలన కేంద్రం పెడతామంటే మాత్రం వద్దు అంటున్నాడంటూ మంత్రి రోజా ఫైర్ అయ్యారు. శనివారం వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ నిర్వహించిన ‘విశాఖ గర్జన’ భారీ ర్యాలీకి వైస్సార్సీపీ మద్దతు ఇవ్వడమే కాదు పార్టీ నేతలు , కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ర్యాలీ లో పాల్గొన్న మంత్రి ఆర్కే రోజా చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లపై ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విడిపోయిన తరువాత చంద్రబాబు చేసిన వెధవ పనులు, అప్పుల వల్ల ఏపీ నష్టపోయిందని, లక్షల కోట్లు అమరావతిలో పెట్టుబడి పెడితే రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర, రాయలసీమ, అమరావతి ప్రాంతాలు కొట్టుకునే పరిస్థితి వస్తుందన్నారు. అప్పుల్లో ఉన్న రాష్ట్రం మరో 4 లక్షల కోట్లు అమరావతిలో పెట్టుబడి పెట్టి అందరికీ అన్యాయం చేయడం కంటే రూ.10 వేల కోట్లతో విశాఖలో పరిపాలన రాజధాని చేయడం, కర్నూలులో న్యాయరాజధాని పెట్టి అందరికీ సమానంగా న్యాయం చేయాలని సీఎం జగన్‌ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని రోజా అన్నారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు అసలు ఇష్టం లేదని రోజా విమర్శించారు. ‘పవన్ కళ్యాణ్ కు పెళ్లి చేసుకోవడానికి వైజాగ్ అమ్మాయి కావాలి. షూటింగ్ లు చేసుకోవడానికి, ఆయన సినిమా కలెక్షన్లకు, నటన నేర్చుకోవడానికి వైజాగ్ కావాలి. చివరికి ఆయన పోటీ చేయడానికి గాజువాక కావాలి. కానీ వైజాగ్ లో పరిపాలన కేంద్రం పెడతామంటే వద్దు అంటున్నాడు అంటే విషయం అర్థమవుతోంది’ అని ఎద్దేవా చేశారు. మూడు ప్రాంతాల అభివృద్ధిని కోరుకుంటున్న మమ్మల్ని పిచ్చి కుక్కలు అని టీడీపీ అంటోంది…వికేంద్రీకరణను అడ్డుకుంటున్న అచ్చ న్నాయుడు వంటి టీడీపీ వాళ్లే గజ్జికుక్కలు అంటూ నిప్పులు చెరిగారు.చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ బినామీ అని.. చంద్రబాబు ఎప్పుడు సమస్యల్లో వున్నా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతారని ఎద్దేవా చేశారు.