IPL ఫైనల్లో చిత్తుగా ఓడిన SRH

ఐపీఎల్-2024 టైటిల్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. ఈ లీగ్‌లో కోల్‌కతా జట్టు మూడోసారి ఛాంపియన్‌గా నిలిచింది. కేకేఆర్ జట్టు పదేళ్ల తర్వాత టైటిల్‌ను గెలుచుకుంది. చివరిసారి కోల్‌కతా 2014లో ఛాంపియన్‌గా నిలిచింది.

ఈ టోర్నీలో అనూహ్య ప్రదర్శనలతో ఫైనల్‌ చేరిన సన్‌రైజర్స్‌.. చివరిమెట్టుపై బోల్తా పడడంతో అభిమానులు ఓటమిని తట్టుకోలేకపోతున్నారు. ఇక వేలం పాట నుంచి మొదలు మ్యాచ్‌లు ఎక్కడ జరిగినా తన జట్టుతో వెన్నంటి ఉండే ఎస్‌ఆర్‌హెచ్‌ యజమాని కావ్య మారన్‌ (Kavya Maran) మ్యాచ్‌ అనంతరం తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. జట్టు ఓడినా, గెలిచినా చప్పట్లతో మద్దతు తెలిపే తను.. ఫైనల్‌లో ఆరెంజ్‌ ఆర్మీ ఓడడంతో కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. కళ్లలో నీళ్లు తిరుగుతుండగా చప్పట్లు కొడుతూనే, కెమెరా కంట పడకుండా వెనక్కి తిరిగి కన్నీళ్లు తుడుచుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది.