హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకకు రావాల్సిందిగా కేసీఆర్ కు కిషన్ రెడ్డి లేఖ

సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమైంది. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పరేడ్‌ గ్రౌండ్స్‌లో కేంద్ర బలగాలతో విమోచన దినోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అమిత్‌ షా ముఖ్య అతిథిగా గౌరవ వందనం స్వీకరించనున్నారు. సాంస్కృతిక శాఖ నిర్వహించే కార్యక్రమాల్లో మహారాష్ట్ర, కర్నాటక ముఖ్యమంత్రులు కూడా పాల్గొననున్నారు. ఈ సందర్బంగా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా సీఎం కేసీఆర్ కు లేఖ రాసినట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

ఈ లిబరేషన్‌ డేను సెప్టెంబర్ 17, 2022 నుంచి సెప్టెంబర్ 17, 2023 అంటే ఏడాది పాటు నిర్వహించాలని నిర్ణయించిందని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి విచ్చేస్తున్నట్టు స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ గెస్ట్ ఆఫ్ హనర్‌గా హాజరు కావాలని కిషన్ రెడ్డి ఆహ్వానం పలికారు. తెలంగాణ సీఎంతో పాటు, మహారాష్ట్ర సీఎం ఎక్ నాథ్ షిండే, కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మైలకు సైతం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖలు రాశారు.

ఇక గత కొద్దీ రోజులుగా బిజెపి నేతలు పదే పదే మజ్లిస్ పార్టీకి భయపడి కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. తాము అధికారికంగా నిర్వహిస్తామని చెపుతూ వస్తున్నారు. ఇటీవల మునుగోడు లో జరిగిన బహిరంగ సభలోనూ అమిత్ షా ఇదే విషయాన్ని ఉద్ఘాటించారు. కానీ.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకముందే.. సెప్టెంబర్ 17న భారీ కార్యక్రమానికి ప్లాన్ చేసింది. ఆ రోజు తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన రోజు కాబోతోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మహారాష్ట్ర, కర్నాటకతో తెలంగాణ విమోచనానికి లింక్‌ ఉండటంతో ఏక్నాథ్ షిండే, బసవరాజు బొమ్మైకు ఆహ్వానం కూడా పంపించారు. గతంలో నిజాం రాజ్యంలో కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన పలు జిల్లాలు ఉండటంతో.. వారిని కూడా ఈ వేడుకల్లో భాగస్వామ్యం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.