వర్షంలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి

శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరిన కిషన్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు

Kishan Reddy protested by sitting on the road in heavy rain

హైదరాబాద్‌ః తెలంగాణ బిజెపి నేతలు తలపెట్టిన బాటసింగారంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిశీలన కార్యక్రమం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇప్పటికే ఈటల రాజేందర్, డీకే అరుణ తదితర నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అక్కడి నుంచి నేరుగా బాటసింగారానికి బయల్దేరారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే రఘునందన్ రావు, పెద్ద సంఖ్యలో బిజెపి శ్రేణులు ఉన్నారు. అయితే వారి వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి, రఘునందర్ రావు, ఇతర నేతలు భారీ వర్షంలోనే రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్ర మంత్రినైన తన వాహనాన్ని అడ్డుకుంటారా అని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ కమిషనర్ అక్కడకు వచ్చి కోరినా ఆయన తగ్గలేదు. తాను ఇక్కడి నుంచి వెళ్తే బాట సింగారం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్దకే వెళ్తానని, లేకపోతే ఇక్కడే కూర్చుంటానని చెప్పారు. ఇది ప్రజాస్వామ్యమా లేక నిజాం రాజ్యమా అని ప్రశ్నించారు. మరోవైపు ఆయనను అక్కడి నుంచి తరలించే ప్రయత్నాన్ని పోలీసులు చేస్తున్నారు.