ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత్ శుభారంభం

మనీలా: ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు శుభారంభం చేసింది. ఏస్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ ముందుండి నడిపించాడు. గ్రూప్ ‘బి’లో కజకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 4-1తో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ క్వార్టర్ ఫైనల్స్‌ను దాదాపు ఖాయం చేసుకుంది. ముందుగా జరిగిన మూడు సింగిల్స్ పోటీల్లో శ్రీకాంత్, లక్ష్య సేన్, శుభాంకర్ డే అలవోక విజయాలు సాధించారు. తొలి మ్యాచ్ బరిలోకి దిగిన ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ కేవలం 23 నిమిషాల్లోనే ప్రత్యర్థిని ఓడించాడు. శ్రీకాంత్ 21-10, 21-7తో డిమిత్రి పనరిన్‌పై సునాయాస విజయం సాధించాడు. ఇక లక్ష్యసేన్ కూడా 21 నిమిషాల్లో ఆట ముగించాడు. లక్ష్యసేన్ 21-13, 21-8తో అర్తుర నియజోవ్‌పై గెలుపొందాడు. శుభాంకర్ డే 21-11, 21-5తో కైత్‌మురత్ కుల్మతోవ్‌పై గెలిచేందుకు 26 నిమిషాలే పట్టింది. గురువారం జరిగే తమ తదుపరి లీగ్ మ్యాచ్‌లో మలేసియాతో భారత్ ఆడుతుంది. ఒక్కో గ్రూప్ నుంచి రెండేసి జట్లు క్వార్టర్స్ చేరతాయి. కరోనా వైరస్ భయంతో భారత మహిళల జట్టు టోర్నీకి దూరమైన సంగతి తెలిసిందే.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/