ఖర్గే లేదా రాహుల్ ప్రధానిగా ఎంపికయ్యే అవకాశం : శశిథరూర్ కీలక వ్యాఖ్యలు

తొలి దళిత ప్రధానిగా ఖర్గేకు అవకాశం ఇవ్వొచ్చని అంచనా

Kharge or Rahul likely to be PM pick, feels Shashi Tharoor

న్యూఢిల్లీః వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ అధికారంలోకి వస్తే ప్రధానిగా ఎవరిని ఎంపిక చేస్తారనే విషయంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమిలోని అన్ని పార్టీలకు ఆమోదయోగ్యమైన అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం మల్లికార్జున ఖర్గే లేదా రాహుల్ గాంధీలలో ఒకరిని ఎంపిక చేస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. వారిద్దరికే ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయని వివరించారు.

ఖర్గేకు అవకాశం ఇస్తే దేశానికి తొలి దళిత ప్రధానిగా ఆయన రికార్డు సృష్టిస్తారని, ఖర్గే వైపు మొగ్గుచూపడానికి ఇది ప్రధాన కారణంగా నిలుస్తుందని శశిథరూర్ చెప్పారు. అయితే, కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ కావడంతో రాహుల్ గాంధీని ప్రధానిని చేసే అవకాశం లేకపోలేదని అభిప్రాయపడ్డారు. కాగా, కేంద్రంలోని అధికార ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా 28 ప్రతిపక్ష పార్టీలు కూటమిగా ఏర్పడి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ 28 పార్టీలు కలిసి ఇండియా పేరుతో కూటమిని ఏర్పాటు చేశాయి. ఇందులో కాంగ్రెస్ తో పాటు జనతాదళ్, ఆర్జేడీ, టీఎంసీ, ఎన్సీపీ, ఎస్పీ సహా పలు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి.