స్వలింగ సంపర్కులపై వివక్ష చూపకూడదు: సీజేఐ డీవై చంద్ర‌చూడ్‌

Supreme Courts HISTORIC Verdict On Same Sex Marriage

న్యూఢిల్లీ : స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధ ధ్రువీకరణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనం పిటిషన్లపై 4 వేర్వేరు తీర్పులను ఇచ్చింది. ‘‘ప్రత్యేక వివాహ చట్టంలో మార్పులు చేయడం పార్లమెంటు విధి. కోర్టులు చట్టాలను తయారు చేయలేవు. స్వలింగ సంపర్కం.. నగరాలకో, సంపన్న వర్గాలకో పరిమితం కాదు. వివాహ చట్టంలో మార్పు అవసరమా కాదా అనేది పార్లమెంటు నిర్ణయిస్తుంది. స్వలింగ సంపర్కులపై వివక్ష చూపకూడదు.. అందరినీ సమానంగా చూడాలి. భిన్న లింగ జంటలే మంచి తల్లిదండ్రులుగా ఉంటారని చట్టం భావించట్లేదు’’ అని సీజేఐ తెలిపారు.

స్వ‌లింగ సంప‌ర్కుల వివాహాన్ని ప్రాథ‌మికంగా గుర్తించ‌లేమ‌ని సీజే చంద్ర‌చూడ్ తెలిపారు. సేమ్ సెక్స్ మ్యారేజ్‌పై భిన్నాభిప్రాయాలు ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. హోమోసెక్స్ లేదా విచిత్ర వైఖ‌రి కేవ‌లం ప‌ట్ట‌ణ విధానం కాదు అని, స‌మాజంలో అది కేవ‌లం ఉన్న‌త వ‌ర్గాల‌కు చెందిన‌ది మాత్ర‌మే కాదు అని సీజే అన్నారు. స్వలింగ వివాహాల‌పై కోర్టు చ‌ట్టాన్ని రూపొందించ‌లేద‌న్నారు. పెళ్లి అనేది స్థిర‌మైన‌, మార్పులేని వ్య‌వ‌స్థ అన్న భావ‌న క‌రెక్టు కాదు అని, ఒక‌వేళ ప్ర‌త్యేక మ్యారేజ్ చ‌ట్టాన్ని కొట్టివేస్తే, అప్పుడు దేశం స్వాతంత్య్రానికి కంటే ముందు రోజుల్లోకి వెళ్తుంద‌న్నారు. కేవ‌లం పార్ల‌మెంట్ ద్వారానే స్పెష‌ల్ మ్యారేజ్ యాక్టులో మార్పులు చేయాల‌ని సీజే సూచించారు. శాస‌న వ్య‌వ‌హారాల్లోకి కోర్టు జోక్యం చేసుకోదు అని చంద్ర‌చూడ్ తెలిపారు.

లైంగిక ప్ర‌వృత్తి ఆధారంగా వివ‌క్ష ప్ర‌ద‌ర్శించ‌డం స‌రికాదు అని సీజే అన్నారు. పెళ్లి చేసుకున్న ఆడ‌-మ‌గ జంట మాత్ర‌మే పిల్ల‌ల‌కు స్థిర‌త్వాన్ని ఇవ్వ‌గ‌ల‌ద‌న్న ఆధారాలు ఎక్క‌డా లేవ‌న్నారు. స్త్రీ-పురుష జంట‌ల‌కు క‌ల్పించే సేవ‌ల్ని .. స్వలింగ సంప‌ర్కుల‌కు ఇవ్వ‌క‌పోవ‌డం ప్రాథ‌మిక హ‌క్కుల ఉల్లంఘ‌నే అవుతుంద‌ని సీజే అన్నారు. ద‌త్త‌త హ‌క్కుల‌కు ఎల్జీబీటీ జంట‌ల‌కు క‌ల్పించ‌క‌పోవ‌డం ఆర్టిక‌ల్ 15ను ఉల్లంఘించిన‌ట్లు అవుతుంద‌ని సీజే తెలిపారు. లైంగిక ప్ర‌వృత్తి ఆధారంగా స్వలింగ జంట‌ల ప‌ట్ల వివ‌క్ష చూప‌డం క‌రెక్టు కాదు అని, ఆయా వ్య‌క్తుల ప‌ట్ల వివ‌క్ష చూప‌కుండా ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీజే త‌న తీర్పులో పేర్కొన్నారు.