శోభాయాత్రకు సిద్దమవుతున్న ఖైరతాబాద్ మహాగణపతి

ఖైరతాబాద్ మహాగణనాధుడు శోభాయాత్రకు సిద్ధమయ్యారు. రేపటి శోభాయాత్ర కోసం ఖైరతాబాద్ ఉత్సవ నిర్వహకులు ఏర్పాట్లు ప్రారంభించారు. ఒకరోజు ముందుగానే మండపం షెడ్డును తొలగించారు. మట్టి గణపతి కావడంతో నిర్వాహకులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ట్రక్ వెల్డింగ్ పనులు పూర్తయ్యాయి. మధ్యాహ్నం ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. మరోవైపు చివరి రోజు కావడంతో ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేలాదిగా భక్తులు ఖైరతాబాద్‌కు తరలివస్తున్నారు.

వినాయకచవితి అనగానే రాష్ట్ర ప్రజలకు గుర్తొచ్చేది హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేషుడు. ప్రతి ఏడాది భిన్నమైన రూపాల్లో భక్తులకు దర్శనమిస్తూ ఆకట్టుకునే ఆ మహాగణపతి, ఈ ఏడాది పంచముఖ లక్ష్మీ గణపతిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఈసారి ఖైరతాబాద్ మహాగణపతిని మట్టితో రూపుదిద్దుకున్నాడు. ఈ ఏడాది 50 అడుగుల ఎత్తులో కొలువుదీరాడు. మరోపక్క గణేష్ నిమజ్జనాలకు ట్యాంక్ బండ్‌పై జీహెచ్ఎంసీ భారీగా ఏర్పాట్లు చేసింది. ట్యాంక్ బండ్‌పై 15 క్రేన్లు.. ఎన్టీఆర్ మార్గ్‌లో 9.. పీవీ మార్గ్‌లో 8 క్రేన్లను ఏర్పాటు చేసింది. గ్రేటర్‌లో 354 కిలోమీటర్ల మేర శోభాయాత్ర సాగనుంది.