పెను ప్రమాదం నుండి బయటపడ్డ కెజిఎఫ్ నటుడు

రాక్ స్టార్ రాష్ – ప్రశాంత్ నీల్ కలయికలో వచ్చిన కెజిఎఫ్ 1 , కెజిఎఫ్ 2 లు ఎంత పెద్ద విజయం సాధించాయో..ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేశాయో చెప్పాల్సిన పనిలేదు. ఈ సిరీస్ లలో నటించిన నటి నటులకు ఎంతో పేరు , ప్రాఖ్యాతలు వచ్చాయి. అలాంటి నటుల్లో అవినాష్ ఒకరు. కెజిఎఫ్ లో అండ్రూ క్యారెక్టర్‌లో అవినాష్ ఎంతో బాగా నటించి ఆకట్టుకున్నారు. కాగా అవినాష్ తాజాగా పెను ప్రమాదం నుండి బయటపడ్డారు. ఈ విషయాన్నీ స్వయంగా అవినాశే తెలిపారు.

‘నిన్న ఉదయం 6:05 గంటలకు నేను జీవిత కాలానికి సరిపడా భయం చూశాను. క్షణాల్లో అనుకోకుండా ప్రమాదం జరిగింది. నేను జిమ్ నుంచి కారు నడుపుకుంటూ వెళుతుండగా.. అనిల్ కుంబ్లే దగ్గర గ్రీన్ లైట్ సిగ్నల్ పడింది. ఎదురుగా వస్తున్న కంటైనర్‌ రెడ్ సిగ్నల్‌ను క్రాస్ చేసి వేగంగా వచ్చి నా కారు ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ నాకేమి కాలేదు.ఎలాంటి గాయాలు కాలేదు. కానీ కారు బాగా డ్యామేజ్ అయింది. నాకు అండగా నిలబడిన కుటుంబ సభ్యులు, స్నేహితులకు చాలా థ్యాంక్స్. ట్రక్ డ్రైవర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశా. అభిమానులు నా పట్ల చూపిస్తోన్న ప్రేమ నాకు చాలా అనుభూతిని కలిగిస్తోంది. నేను చాలా అదృష్టవంతుడిని. ధన్యవాదాలు..’ అంటూ కేజీఎఫ్ విలన్ రాసుకొచ్చాడు.