కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కు ఏటీఎం లాంటిది – కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్

జులై 2 నుండి బిజెపి కార్యనిర్వహణ సమావేశాలు హైదరాబాద్ లో జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోడీ తో పాటు బిజెపి అగ్ర నేతలు , ఇతర రాష్ట్రాల బిజెపి ముఖ్యమంత్రులు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే కొంతమంది హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ తరుణంలో నేతలు కేసీఆర్ సర్కార్ ఫై నిప్పులు చేరగడం , విమర్శలు చేయడం మొదలుపెట్టారు.

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ మోడీ విజయ సంకల్ప సభ ఏర్పాట్లలో భాగంగా జీడీమెట్ల లోని సరోజినీ గార్డెన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా వచ్చిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబానికి మాత్రమే నిధులు, నియామకాలు వచ్చాయన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలయిందన్నారు. పథకాల పేరుతో కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారన్న ఆయన… రైతులు, కార్మికులు, నిరుద్యోగులను టీఆర్ఎస్ ప్రభుత్వం వంచించిందని విమర్శించారు. రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని, అందుకోసం కార్యకర్తలు బాగా కష్టపడాలని అనురాగ్ ఠాగూర్ పిలుపునిచ్చారు.