భారీ వర్షాలు..ఆరెంజ్ అలర్ట్ జారీ..కేదార్‌నాథ్ యాత్ర నిలిపివేత

రుద్రప్రయాగ్: ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ యాత్ర ను నిలిపివేశారు. సోన్‌ప్రయాగ్, గౌరికుండ్ వద్ద యాత్రికులను నిలిపివేసినట్లు అధికారులు ఇవాళ ప్రకటించారు. భక్తుల భద్రత నేపథ్యంలో ఆ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో యాత్రికుల్ని ఆపేసినట్లు తెలిపారు.
ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న వర్షాల వల్ల నాలుగు రహదారుల్ని మూసివేశారు. కొండచరియలు విరిగిపడడం వల్ల పది లింకు రోడ్డులను కూడా బ్లాక్ చేశారు. మందాకిని, అలకనంద నదులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఐఎండీ ఇవాళ ఉత్తరాఖండ్ కోసం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ ట్వీట్ చేసింది.
ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో తమ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని సీఎం పుష్కర్ సింగ్ థామి తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, పీడబ్ల్యూడీ శాఖలన్నీ రెఢీగా ఉన్నట్లు ఆయన చెప్పారు. గంగోత్రి జాతీయ రహదారిపై మంగళవారం కొండచరియలు విరిగిపడడం వల్ల నలుగురు మృతిచెందారు. పది మంది గాయపడ్డారు.