పేకాట కేసు : నాగశౌర్య తండ్రికి పోలీసుల నోటీసులు

హీరో నాగ శౌర్య కు చెందిన విల్లా లో పేకాట ఆడుతున్నారని సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం రాత్రి దాడులు చేసి పలువురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బ్యాన్‌ ఉన్న ఆటకు అడ్డాను సృష్టించడంతో నాగశౌర్య తండ్రికి నోటీసులిచ్చారు. ఇప్పుడు పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఒక్క నాగశౌర్య ఫాంహౌస్ లోనే కాదు.. శివారుల్లోని అనేక ఫామ్ హౌస్ లో ఇదే దందా జరుగుతోంది. నాగశౌర్య ఫామ్ హౌస్ లో ఆట నడుపుతున్న నిర్వాహకుడు గుత్తా సుమంత్ విచారణలో ఈ విషయాలు బయటకు వస్తున్నాయి.

సుమంత్ అనే వ్యక్తి ఫోన్ ను కాల్ డేటాను పోలీసులు పరిశీలించగా విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. ఆయన ఈ ఒక్క ఫామ్ హౌస్ లోనే కాదు.. శివారుల్లోని వేర్వేరు ఏరియాల్లో వేర్వేరు ఫామ్ హౌసుల్లో ఇదే దందా నడుపుతున్నాడని తెలుస్తోంది. ప్రతీ ఫామ్ హౌస్ కి ఒక్కో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసినట్లు సమాచారం.ప్రతీ వాట్సాప్ గ్రూప్ లో 200 మంది వరకూ జూదగాళ్లు ఉన్నారట.. అందరూ బడాబాబులే అని తెలుస్తోంది. ఫామ్‌హౌస్‌ పేకాట వ్యవహారంలో కొత్తగా బుజ్జి అనే వ్యక్తి బయటకి వస్తోంది. ఈ బుజ్జి ఎవరో కాదు… నాగశౌర్యకు బాబాయి. అంటే.. ఫామ్‌హౌస్‌ లీజ్ అగ్రిమెంట్‌ నాగశౌర్య తండ్రి రవీంద్రప్రసాద్‌ పేరు మీద ఉంటే.. ఫామ్‌హౌస్ కార్యకలాపాన్నీ బాబాయి బుజ్జీ చూసుకుంటున్నట్లు సమాచారం. ఈయన పాత్రపై పోలీసులు ఇప్పుడు లోతుగా విచారణ చేస్తున్నారు.