కేసీఆర్ మరో తీపి కబురు : త్వరలో ‘గిరిజన బంధు’

తెలంగాణ సీఎం మరో తీపి కబురు అందించారు. దళితులకు రైతు బంధు ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు గిరిజనుల కోసం ‘గిరిజన బంధు’ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ.. వారం రోజుల్లో జీవో విడుదల చేస్తామని ప్రకటించి వారిలో సంబరాలు నింపారు. శనివారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఆదివాసీ, బంజారాల‌ ఆత్మీయ స‌భ నిర్వ‌హించారు. ఈ ఆత్మీయ స‌భ‌కు రాష్ట్రం న‌లుమూల‌ల నుంచి గిరిజ‌నులు, ఆదివాసీలు భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు. కుమ్రం భీం, సంత్ సేవాలాల్ విగ్ర‌హాల‌కు సీఎం కేసీఆర్ పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు.

అనంత‌రం గిరిజ‌నుల‌ను, ఆదివాసీల‌ను ఉద్దేశించి కేసీఆర్ ప్ర‌సంగించారు. దళిత బంధు తరహాలోనే గిరిజన బంధు అమలు చేస్తామని పేర్కొన్నారు. తన చేతుల మీదుగానే గిరిజన బంధు పథకం ప్రారంభిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. భూములు లేని గిరిజనులకు పోడు భూములు పంచుతామనన్నారు. గిరిజన బంధు ద్వారా రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. “మోడీ.. ఆ జీవో అమలు చేస్తారా? దాన్నే ఉరితాడు చేసుకుంటారా?” అంటూ సభావేదిక నుంచి ప్రధానిని నిలదీశారు. గిరిజ‌నుల‌కు రిజ‌ర్వేష‌న్ల పెంపు విష‌యంలో కేంద్రాన్ని అడిగి అడిగి విసిగిపోయాం. ఇక విసిగి పోద‌ల్చుకోలేదు.

ఏపీలో ఉన్న‌ప్పుడు మ‌న గిరిజ‌న జాతి 6 శాతం రిజ‌ర్వేష‌న్లు పొందింది. ఆ రిజ‌ర్వేష‌న్ల‌ను 10 శాతానికి పెంచాల‌ని అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఏడు సంవ‌త్స‌రాలు గ‌డించింది. ప్ర‌ధాని మోడీని అడుగుతున్న‌ప్ప‌టికీ స్పంద‌న లేదు. విభ‌జ‌న రాజ‌కీయాలు మొద‌లు పెట్టిన‌ అమిత్ షాను అడుగుతున్నాం. మీకేం అడ్డం వ‌స్తుంది. ఎందుకు ఆపుతున్నారు. రాష్ట్ర‌ప‌తి ఆమోదం చేసి పంపిస్తే ఐదు నిమిషాల్లో జీవో విడుద‌ల చేస్తాం. బ్ర‌హ్మాండంగా రిజ‌ర్వేష‌న్లు అమ‌ల‌వుతాయి. ఎందుకు తొక్కిపెడుతున్నారు. చేతులు జోడించి మోడీని అభ్య‌ర్థిస్తున్నా. మా బిల్లుకు రాష్ట్ర‌ప‌తి ముద్ర వేసి పంపించండి అని కోరుతున్నా. రాష్ట్ర‌ప‌తిగా కూడా ఆదివాసీ బిడ్డ‌నే ఆమె బిల్లును ఆపక‌పోవ‌చ్చు అన్నారు.

‘మాకు వచ్చే న్యాయమైన హక్కునే మేం కోరుతున్నాం. ఎనిమిది సంవత్సరాల్లలో కేంద్రం ఒక్క మంచి పనైనా చేసిందా? ఎన్నో కష్టాలకోర్చి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ మరో కల్లోలానికి గురికావొద్దు. తెలంగాణ సమాజం అంతా ఐకమత్యంగా ఉండాలి. మన సంక్షేమ కార్యక్రమాలు చూసి మిగతా రాష్ట్రాలు కూడా ప్రభావితమవుతున్నాయి. సంపద పెంచుకోవటం.. పేదలకు పంచుకోవటమే మన సిద్ధాంతం. గిరిజన గురుకులాలలను ఇంకా పెంచుతాం. ఈ ఏడాదే గిరిజన బాలికలకు గురుకులాలు తెచ్చేందుకు ఆలోచిస్తున్నాం. భారతజాతి ప్రతినిధులుగా గిరిజన బిడ్డలు ఎదగాలి. భూమిలేని గిరిజనులకు గిరిజన బంధు అమలు చేస్తాం. సమయం చూసి ఆ కార్యక్రమాన్ని సైతం మొదలుపెడతాం.’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.