గాంధీ గురించి ఈ త‌రం పిల్ల‌ల‌కు తెలియాలి – కేసీఆర్

గాంధీజీ లాంటి స్వాతంత్య్ర సమరయోధుల గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ఈతరంపై ఉందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఎల్బీ స్టేడియంలో నిర్వ‌హించిన స్వ‌తంత్ర భార‌త వ‌జ్రోత్స‌వ ముగింపు వేడుక‌ల్లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

మ‌న దేశంలో మ‌న రాష్ట్రానిది ఒక ప్ర‌త్యేక‌మైన స్థానం. స్వ‌తంత్ర భార‌త స్ఫూర్తిని ఈ త‌రం పిల్ల‌ల‌కు, యువ‌కుల‌కు తెలియ‌ని వారికి విస్తృతంగా తెలియ‌ప‌ర‌చాల‌నే ఉద్దేశంతో ఈ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టామ‌ని ముఖాయమంత్రి కేసీఆర్ తెలిపారు. పేదల ఆశలు ఇంకా నెరవేరలేదని..స్వాతంత్య్ర ఫలాలు అందలేదని అనేక వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. అనేక వర్గాల ప్రజలు తమకు న్యాయం జరగలేదనే భావనలో ఉన్నారన్నారు. కేశవరావు కమిటీ స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా రాష్ట్రంలో వివిధ రకాల కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిందని కేసీఆర్ అభినందించారు.

ఈ సందర్భంగా సురవరం ప్రతాప రెడ్డి వారసుడు సురవరం అనిల్​ కుమార్​ రెడ్డి, భాగ్యరెడ్డి వర్మ వారసుడు అజయ్​ గౌతమ్​, కొమరం భీం వారసుడు కుమరం సోనేరావు, కల్నల్​ సంతోష్​ బాబు తండ్రి బిక్కుమళ్ల ఉపేందర్, వనజీవి రామయ్య, రావెళ్ల వెంకట్రామారావు తనయుడు రావెళ్ల మాధవరావు, బాక్సర్​ నిఖత్​ జరీన్​, టేబుల్​ టెన్నిస్​ ప్లేయర్​ ఆకుల శ్రీజ, బాక్సర్​ మహ్మద్​ హుసాముద్దీన్​, సంగీత దర్శకుడు శంకర్​ మహదేవన్​ తదితరులను కేసీఆర్ సన్మానించారు. ఈ దేశాన్ని ఉన్మాద స్థితిలోకి నెట్టివేసేందుకు కుటిల ప్ర‌య‌త్నాలు జ‌ర‌గ‌డాన్ని మ‌నమంతా చూస్తున్నాం. మౌనం వ‌హించ‌డం స‌రికాదు. అర్థమైన త‌ర్వాత కూడా అర్థం కాన‌ట్టు ప్ర‌వ‌ర్తించ‌డం మేధావుల ల‌క్ష‌ణం కాదు. ధీరోదాత్తులు, మేధావులు, వైతాళికులు క‌ర‌దీపిక‌లుగా మారి ఏ స‌మాజాన్ని అయితే స‌క్ర‌మ‌మైన మార్గంలో న‌డిపిస్తారో ఆ స‌మాజం గొప్ప‌గా పురోగ‌మించే అవ‌కాశం ఉంటుంద‌ని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

సామూహిక జాతీయ గీతాలాప‌న చేయాలంటే సుమారు కోటి మంది పాల్గొన్నారు. ఏక‌కాలంలో ఆల‌పించ‌డం తెలంగాణ రాష్ట్రానికి గ‌ర్వ‌కార‌ణం అని సీఎం పేర్కొన్నారు. మ‌హాత్ముడు విశ్వ‌మాన‌వుడు. కొంద‌రు అల్పులు నీచంగా మాట్లాడుతున్నారు. ఆయ‌న గొప్ప‌త‌నాన్ని యూఎన్‌వో ప్ర‌శంసించింది. అంత‌ర్జాతీయంగా ఏ దేశానికి వెళ్లిన ఇండియా అంటే యూ ఆర్ గ్రేట్ అని పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తుంటూరు. గాంధీ గారి జీవిత విశేషాలు, విగ్ర‌హాలు.. విదేశాల్లో ఉన్నాయంటే భార‌త‌దేశానికి గ‌ర్వ‌కార‌ణం అని చెప్పారు.

గాంధీ సినిమాను 22 ల‌క్ష‌ల మంది పిల్ల‌లు చూశారంటే 10 శాతం మందికి స్ఫూర్తి క‌లిగిన కూడా ఈ దేశం బాగా పురోగ‌మించ‌డానికి వారి శ‌క్తిసామ‌ర్థ్యాలు వినియోగిస్తున్నార‌ని న‌మ్ముతున్నాను. ఇటువంటి స్ఫూర్తి ముందు కూడా కొన‌సాగాలి. గాంధీ మార్గంలో దేశం పురోగ‌మించాలి. అహింసా సిద్ధాంతాన్ని ఉప‌యోగించుకొని తెలంగాణ సాధించాం. ఏ విధంగా పురోగ‌మిస్తున్నామో మ‌న‌కు తెలుసు. చాలా గొప్ప‌గా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన అంద‌రికీ, అల‌రించిన క‌ళాకారుల‌కు కేసీఆర్ ధ‌న్య‌వాదాలు తెలిపారు.