ఈరోజు సాయంత్రం మంత్రులతో సీఎం కేసీఆర్ సమావేశం

ఈరోజు శుక్రవారం సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ..మంత్రులతో సమావేశం కాబోతున్నారు. ప్రగతి భవన్‌లో జరుగనున్న ఈ సమావేశానికి మంత్రులతోపాటు ఫ్లోర్‌ లీడర్లు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా పరిణామాలు, రాజకీయ, పాలనాపరమైన అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

కొద్ది రోజులుగా ఫాం హౌస్ కు పరిమితమైన ముఖ్యమంత్రి..ఈ కీలక భేటీ ఏర్పాటు వెనుక ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోతున్నారనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. వచ్చే నెల 18న ఎన్నిక జరగనుంది. ఇప్పటి వరకు అటు కేంద్రంలోని ముఖ్యులు.. ఇటు కాంగ్రెస్ నేతలు తమ అభ్యర్ధుల పైన కసరత్తు పూర్తి చేసారు. ఆప్షన్లు సిద్దం చేసుకున్నారు. ముందుగా ఎన్డీఏ తమ అభ్యర్ధిని ఖరారు చేసిన తరువాత తమ నిర్ణయం ప్రకటించేందుకు కాంగ్రెస్ సిద్దమైంది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి మద్దతు కోరుతూ పలు పార్టీలతో ప్రాధమికంగా చర్చలు జరిగాయి. అయితే, ప్రాంతీయ పార్టీల్లో ఇప్పుడు కేసీఆర్ కీలకంగా మారారు.

ఇప్పటికే శివసేన..ఎన్సీపీ..డీఎంకే..జేడీఎస్.. జేఎంఎం..ఆప్ నేతలతో వరుస భేటీలు నిర్వహించారు. అందరూ కలిసికట్టుగా ముందుకు సాగేలా నిర్ణయించారు. దీంతో..సీఎం కేసీఆర్ నేటి సమావేశంలో జరుగుతున్న పరిణామాలను వివరించి..రాష్ట్రపతి ఎన్నికల వేళ తన నిర్ణయం వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. టీఆర్ఎస్ ఇప్పుడు ఎన్డీఏ అభ్యర్ధికి మద్దతిచ్చే అవకాశాలు లేవు. కాంగ్రెస్ నాయకత్వంలో ప్రతిపాదించే అభ్యర్ధికి మద్దతిస్తారా లేదా అనేది నేటి సమావేశంలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ప్రభుత్వం పైన ఆరోపణలకు..అసాంఘిక చర్యలకు కారణంగా నిలుస్తున్న పబ్ ల విషయంలో కఠినంగా వ్యవహించాలని సీఎం నిర్ణయంగా విశ్వసనీయ సమాచారం.