ఈ నెల 25న హర్యానాకు సీఎం కేసీఆర్

CM KCR Participating in Closing Ceremony of Svatantra Bharatha Vajrotsavam at LB Stadium

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 25 న హర్యానా కు వెళ్లనున్నారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు కేసీఆర్ పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల బిహార్ వెళ్లిన ముఖ్యమంత్రి.. ఈ నెల 25 న హర్యానాకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి దేవిలాల్ జయంతి ఉత్సవాలకు కేసిఆర్ హాజరుకాబోతున్నారు. ఈ కార్యక్రమంలో నితీశ్ కుమార్, మమతా బెనర్జీతో పాటు కీలక నేతలతో వేదిక పంచుకోనున్నారు.

ఈనెల 25న ‘సమ్మన్ దివస్’ పేరుతో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే కెసిఆర్ తో పాటు బిజెపి వ్యతిరేక పార్టీలన్నీటికి ఆహ్వానం అందింది. కాగా, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పాల్గొంటే మాత్రం కేసిఆర్ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరు హాజరు కావడం లేదనే వార్తలు వస్తున్న నేపథ్యంలో కేసీఆర్ వెళతారని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బిహార్ సీఎం నితీశ్ కుమార్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పాటు మరికొందరు కీలక నేతలు చౌదరి దేవీలాల్ జయంతి వేడుకల్లో పాల్గొననున్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమి బలం తెలిపేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బీజేపీని గద్దె దింపేందుకు సీఎం కేసీఆర్ విపక్ష కూటమి ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్న సమయంలో ఈ పర్యటన చాలా కీలకంగా మారనుంది.