రైతులకు తీపి కబురు తెలిపిన కేసీఆర్

సీఎం కేసీఆర్ రాష్ట్ర రైతులకు తీపి కబురు తెలిపారు. యాసంగి పంట కాలానికి అందించే పంట పెట్టుబడి ‘రైతుబంధు’ నిధులను విడుదల చేయనున్నట్లు తెలిపారు. రైతుబంధు నిధులను డిసెంబర్ 28 నుంచి విడుదల చేయడం ప్రారంభించాలని, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును సీఎం కేసిఆర్ ఆదేశించారు. రైతు బంధు నిధులు, ఎప్పటిలాగే ఒక ఎకరం నుంచి ప్రారంభమై సంక్రాంతి కల్లా రైతులందరి ఖాతాల్లో జమ కానున్నాయి. ఇందుకోసం గాను రూ. 7,600 కోట్ల‌ను, రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది.

ఎకరం కంటే తక్కువ భూమి ఉన్న రైతుల ఖాతాల్లో ముందుగా నిధులు జమ కానున్నాయి. తర్వాత ఎక్కువ భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. సంక్రాంతి కల్లా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరి ఖాతాల్లో నిధులు జమ కానున్నాయని సీఎంఓ తెలిపింది. రైతు బంధు పథకం ద్వారా రైతులకు వానాకాలం, యాసంగి రెండు కాలాలకు ఎకరానికి పదివేల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది అందిస్తోంది.