రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ కు 90 సీట్లు గ్యారెంటీ అనే ధీమాతో కేసీఆర్..

రాబోయే ఎన్నికల్లో 90 సీట్లు సాధిస్తామని ముఖ్యమంత్రి , టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ధీమాగా ఉన్నారు. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి అధ్యక్షతన జరిగిన టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ఎమ్మెల్యే టికెట్ కన్ఫార్మ్ అంటూ కేసీఆర్ స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాల్లో కూడా అడుగుపెట్టబోతున్నామని.. చాలా మందికి రాబోయే రోజుల్లో కేంద్ర మంత్రులు, గవర్నర్లు, విదేశీ రాయబారులుగా అవకాశం లభిస్తుందని కేసీఆర్ అన్నారు. ముందస్తు ఎన్నికలన్నీ ఊహాగానాలే అని.. ఐదేళ్లు ముగిశాకే అసెంబ్లీ ఎన్నికలకంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్‌కు 72 నుంచి 80 స్థానాలు వస్తాయని.. కొద్దిగా కష్టపడితే 90 నుంచి 100 సీట్లు కూడా రావడం ఖాయమంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధిస్తుందని.. సీఎం కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. తాను నిర్వహించిన అలాగే.. ఇతరులు నిర్వహించిన సర్వేల్లో తమ పార్టీకే అనుకూలంగా రిపోర్టు వచ్చిందని, 41 శాతం ఓట్లతో విజయం సాధిస్తామన్నారు. అలాగే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఎంపీలకు హైదరాబాద్ ఖాళీ చేసి నియోజకవర్గాలపై దృష్టి పెట్టాలంటూ దిశా నిర్దేశం చేశారు. సుమారు 2 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల ప్లానింగ్‌ గురించి వివరించారు. కేడర్‌తో ఎలాంటి పొరపచ్ఛాలు రాకుండా వారితో కలిసి వన భోజనాలు చేయాలన్నారు. దళితబంధు, ఆసరా పింఛన్లు, ప్రభుత్వ పథకాలతో ప్రతి లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను వివరించాలని పిలుపునిచ్చారు.