నేడు ఢిల్లీలో రాహుల్‌ భారీ నిరసన ర్యాలీ

నేడు ఢిల్లీలో రాహుల్ ఆధ్వర్యంలో కేంద్రానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ జరగబోతుంది. నిత్యావసరాల ధరలు, నిరుద్యోగం, జీఎస్టీ వంటి సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో నిరసన తెలిపేందుకు సిద్ధమైంది. ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీతో పాటు పార్టీ ఇతర నేతలు ప్రసంగించనున్నారు. ఢిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్ తో పాటు పలు రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ నేతలు ఈ నిరసన ర్యాలీలో పాల్గొననున్నారు.

ఉదయం 11 గంటలకు ఏఐసిసి ప్రధాన కార్యాలయం నుంచి బస్సులలో బయల్దేరి “రాంలీలా మైదాన్” కు చేరుకోనున్న ఏఐసిసి జనరల్ సెక్రటరీలు, సెక్రటరీలు, పిసిసి అధ్యక్షులు, సి.ఎల్.పి నాయకులు, పిసిసి మాజీ అధ్యక్షులు, ఎమ్.పిలు, పార్టీ అగ్రనేతలు… ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు రాంలీలా మైదాన్ లోని సభాస్థలికి చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు భారీ సంఖ్యలో హాజరయ్యే కాంగ్రెస్‌ కార్యకర్తలు, పిసిసి సభ్యులనుద్దేశించి ప్రసంగించనున్నారు రాహుల్ గాంధీ. ఆగస్టు 17 నుంచి 23 వరకు వరుసగా దేశంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ “మెహంగాయ్ చౌపాల్” నిరసన ప్రదర్శనలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ…దీనికి ముగింపుగా నేడు ఢిల్లీలో భారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తోంది.