డబుల్ బెడ్ రూమ్ ల పేరుతో కేసీఆర్‌ ప్రజల్ని మోసగించారుః జేపీ నడ్డా

KCR cheated people in the name of double bedrooms: JP Nadda

న్యూఢిల్లీః పెద్దపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ…ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలోని భారత్ ప్రపంచంలోనే నంబర్ వన్ దేశంగా మారుతుందని ఆయన చెప్పారు. ఇప్పటికే ఫార్మా, పెట్రో కెమికల్స్ రంగాల్లో మన దేశం రెండో స్థానంలో ఉందని తెలిపారు. ఇదివరకు మొబైల్ ఫోన్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్లమని, కానీ నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా స్వదేశంలోనే మొబైల్ ఫోన్ల తయారు చేస్తున్నామని తెలిపారు.

మేకిన్ ఇండియా ద్వారా తయారైన మొబైల్ ఫోన్లనే మనం వినియోగిస్తున్నట్లు నడ్డా చెప్పారు. ఇప్పటివరకు దేశంలో 56 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మించామని, 52 వేల కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల విద్యుద్డీకరణ పూర్తయిందని వెల్లడించారు. ప్రపంచంలో భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఐదోస్థానంలో ఉందని తెలిపారు. దేశంలో విమానాశ్రయాల సంఖ్య 148 కి పెంచామని, లక్షలాది గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించినట్లు జేపీ నడ్డా చెప్పారు.

డబుల్ బెడ్ రూమ్ ల పేరుతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ తెలంగాణ ప్రజల్ని మోసగించారని జేపీ నడ్డా ఆరోపించారు. కేంద్రంలో మూడోసారి మోడీ అధికారంలోకి వస్తే కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్ రూం హామీని బీజేపీ పూర్తి చేస్తుందని ఆయన తెలిపారు. నాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ కేంద్రం అందించిన పీఎంజేవై పథకాన్ని వినియోగించుకోలేకపోయారని, ఇప్పుడు కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి కూడా అదేబాటలో నడుస్తున్నారని ఆయన విమర్శించారు.