ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్య‌ర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్

తెలంగాణ శాసనమండలికి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను బీఆర్‌ఎస్ పార్టీ అధినేత , సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఎమ్మెల్యేల కోటా అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డి లను ఎంపిక చేసారు. ఈ నెల 9వ తేదీన నామినేష‌న్లు దాఖలు చేయాల‌ని ఆ ముగ్గురు అభ్య‌ర్థుల‌కు కేసీఆర్ సూచించారు. నామినేష‌న్ల దాఖ‌లుకు సంబంధించిన ఏర్పాట్లు చూసుకోవాల‌ని శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి, బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

గవర్నర్‌ కోటాలో నామినేట్‌ అయ్యే ఇద్దరి పేర్లను కేబినెట్‌ భేటీ తర్వాత ప్రకటించాలని సీఎం కేఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. మార్చి 9న మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరుగనుంది. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడైన దేశపతి శ్రీనివాస్ తన రచనలతో, పాటలతో తెలంగాణ ఉద్యమ సమయంలో గుర్తింపు సాధించారు. సీఎం కేసీఆర్‌కు దగ్గరయ్యారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ఆయణ్ని సీఎం ప్రత్యేక అధికారిగా నియమించారు.

చల్లా వెంకట్రామిరెడ్డి.. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మనవడు (కుమార్తె కుమారుడు). గతంలో అలంపూర్‌ నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతేడాది డిసెంబర్‌లో కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనకు సముచిత పదవి ఇస్తామని చేరిక సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు హైదరాబాద్‌కు చెందిన కె నవీన్ కుమార్ ఇప్పటికే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయనకు మరో పర్యాయం అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.