ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మవద్దంటూ కేంద్ర మంత్రికి కేటీఆర్ లేఖ

ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను హరించేలా ఉందని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధలను అమ్మేందుకు కేంద్రం ప్రయత్నం య‌త్నిస్తోంద‌ని, వీటికి రాష్ట్ర స‌ర్కారు కేటాయించిన భూముల‌ విలువ సుమారు రూ. 40వేల కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెడ్‌, హిందుస్థాన్ ఫ్లోరో కార్బన్స్ లిమిటెడ్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, హెచ్ఎంటీ, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీసీఐ), ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను మోడీ ప్రభుత్వం తన డిజిన్వెస్ట్మెంట్ ప్రణాళికల్లో భాగంగా అమ్ముతోందని కేటీఆర్ తెలిపారు.

ఆరు కేంద్ర ప్రభుత్వ సంస్ధలకు గతంలో సూమారు 7200 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని లేఖలో వివరించారు. నగరంలో ప్రజా రవాణా కోసం చేపట్టే స్కైవే లాంటి ప్రాజెక్టులకు భూములు అడిగితే మార్కెట్ ధరల ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూములను అమ్మే హక్కు కేంద్రానికి ఎక్కడుందని ప్రశ్నించారు. ప్రభుత్వ ధరల ప్రకారం కనీసం రూ. 5వేల కోట్లకు పైగా ఈ భూముల విలువ ఉంటుంద‌ని, బహిరంగ మార్కెట్ ధరల ప్రకారం రూ. 40వేల కోట్లు ఉంటుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మొద్ద‌ని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌కు మంత్రి కేటీఆర్ ఆదివారం ఓ లేఖ రాశారు.

దేశ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించకుండా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అమ్ముకునే పనిలో మాత్రమే బిజీగా ఉందని విమర్శించారు. దేశాభివృద్ధి, ప్రజల ఆత్మగౌరవానికి ఒకప్పుడు చిహ్నంలా నిలిచిన ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను బిజెపి ప్రభుత్వం అడ్డికి పావుసేరుకు అమ్ముతోందని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన ఎన్నో రాజ్యాంగబద్ద హామీల అమలును పట్టించుకోని మోదీ ప్రభుత్వం.. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పెట్టబడులు ఉపసంహరించే పేరుతో వాటి ఆస్తులను అమ్మేందుకు చేస్తున్న ప్రయత్నాలపై కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు.