మాజీ సీఎం యడియూరప్పకు తప్పిన ప్రమాదం

హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా చుట్టుముట్టిన వ్యర్థాలు

karnataka-ex-cm-bs-yediyurappa-chopper-makes-emergency-landing-post-technical-glitch

బెంగళూరుః కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బిజెపి కీలక నేత బీఎస్ యడియూరప్పకు పెను ప్రమాదం తప్పింది. హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో సమస్య తలెత్తింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్.. హెలికాప్టర్ ను గాల్లోకి లేపి తర్వాత సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కర్ణాటకలో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రచారంలో యడియూరప్ప కీలకంగా వ్యవహరిస్తున్నారు. విజయ్ సంకల్ప్ యాత్రలో పాల్గొనేందుకు సోమవారం ఆయన వెళ్తుండగా కర్ణాటకలోని కాలబురగిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

హెలికాప్టర్ దిగాల్సిన హెలిపాడ్ వద్ద ప్లాస్టిక్, ఇతర వ్యర్థ పదార్థాలు పోగయ్యాయి. ల్యాండింగ్ సమయంలో గాలికి ప్లాస్టిక్ కవర్లు చాపర్ ను చుట్టుముట్టాయి. దీంతో పైలట్ చివరి నిమిషంలో చాకచక్యంగా హెలికాప్టర్‌ను ల్యాండ్ చేయకుండా ముందుకు తీసుకు వెళ్లారు. తర్వాత అధికారులు క్లియరెన్స్ ఇవ్వడంతో సురక్షితంగా హెలికాప్టర్ ను ల్యాండ్ చేశారు. ఈ ఘటన కారణంగా యడియూరప్ప పర్యటన అర్థాంతరంగా వాయిదా పడినట్లు తెలుస్తోంది. యడియూరప్పకు స్వాగతం పలికేందుకు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్న వారందరూ వెనక్కి వెళ్లిపోయారు.