కెసిఆర్‌ను భారీ మెజార్టీతో రేవంత్ రెడ్డి ఓడిస్తారుః కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

మోడీ వందసార్లు వచ్చిన బిజెపికి డిపాజిట్లు రావని విమర్శలు

karnataka-cm-siddaramaiah-public-meeting-in-kamareddy

కామారెడ్డిః తెలంగాణ ప్రజలు కెసిఆర్‌ను ఓడించాలని నిర్ణయించుకున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. ఈరోజు కామారెడ్డిలో కాంగ్రెస్ విజయభేరి యాత్ర – బీసీ డిక్లరేషన్ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య మాట్లాడుతూ… అందరికీ నా నమస్కారాలు అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. తనకు తెలిసినంత వరకు రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న రెండుచోట్ల ఘన విజయం సాధిస్తారన్నారు. కామారెడ్డిలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ను భారీ మెజార్టీతో ఓడిస్తారన్నారు. కేసీఆర్ తన అవినీతి డబ్బుతో మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం కెసిఆర్‌ను ఓడించాలని నిర్ణయించుకున్నారన్నారు.

తెలంగాణలో బిజెపి పని అయిపోయిందని ఆ పార్టీ నాలుగైదు సీట్లు గెలిస్తే ఎక్కువ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని, ఈ నెల 30వ తేదీన ఓటు వేసేందుకు ప్రజలు వేచి చూస్తున్నారన్నారు. పదేళ్ల కెసిఆర్‌ పరిపాలన అవినీతితో కూరుకుపోయిందన్నారు. అందుకే బిఆర్ఎస్‌ను ఇంటికి పంపించాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు. సూర్యుడు తూర్పున ఉదయించడ ఎంత సత్యమో… తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనేది అంతే సత్యమన్నారు. బిజెపి నాయకులు… ఈ దేశ ప్రధాని నరేంద్రమోడీపై ఎక్కువ విశ్వాసం పెట్టుకొని, ఆయనపై ఆధారపడి పోటీ చేస్తున్నారన్నారు. మోడీ ఇక్కడకు వందసార్లు వచ్చినా గెలిచే అవకాశాలు లేవన్నారు.

ప్రధాని మోడీ రెండుసార్లు తెలంగాణకు వచ్చిపోయినప్పటికీ… బిజెపి అభ్యర్థులు ఇక్కడ డిపాజిట్ కోల్పోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. మోడీ కర్ణాటకలో ఎక్కడ రోడ్డు షో నిర్వహించినా ఆ చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే భారీ మెజార్టీతో గెలిచారని చెప్పారు. మోడీపై ఎక్కువ నమ్మకం పెట్టుకొని ఇక్కడ పోటీ చేస్తున్నారన్నారు. తన రాజకీయ చరిత్రలో ఇన్ని అబద్దాలు చెప్పిన ప్రధానిని చూడలేదన్నారు. తెలంగాణ ప్రజలు బిజెపికి సరైన గుణపాఠం చెబుతారన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చాక దేశం ఆర్థికంగా దిగజారిందన్నారు. మోడీ తన తొమ్మిదిన్నర ఏళ్లలో పెద్ద మొత్తంలో అప్పులు చేశారన్నారు. బీసీలు, వెనుకబడిన వర్గాలకు తానే గొప్ప అన్నట్లుగా మోదీ వ్యవహరిస్తున్నారన్నారు. బీసీలు వెనుకబడి ఉండడానికి కారణం నరేంద్రమోదీ అన్నారు.

కెసిఆర్‌ కూడా దళితులకు, వెనుకబడిన వర్గాలను పట్టించుకోలేదన్నారు. తాము అధికారంలోకి రాగానే ఐదు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్లను 23 శాతానికి తగ్గించారన్నారు. బిజెపి నేతలకు, మోడీకి తన పేరు వింటేనే కాళ్లు వణుకుతాయన్నారు. కర్ణాటకలో గ్యారెంటీలు అమలు కాలేదని కేసీఆర్ చెబుతున్నారని, కానీ మీరు మా వద్దకు వస్తే చూపిస్తామన్నారు. తెలంగాణలో తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో అమలు చేస్తామన్నారు. మోడీ, కెసిఆర్‌ అబద్దాలు నమ్మవద్దని కోరారు. ఈ దేశంలో కాంగ్రెస్ ఒక్కటే పేదలకు, దళితులకు, బీసీలకు న్యాయం చేయగలిగే పార్టీ అన్నారు. బిజెపి, బిఆర్ఎస్ పార్టీలకు తేడా లేదన్నారు. కేంద్రంలో బిజెపికి అన్ని విధాలుగా బిఆర్ఎస్ సహకరిస్తోందన్నారు. బిఆర్ఎస్…. బిజెపికి బీ టీమ్ అన్నారు. బిజెపి,బిఆర్ఎస్‌లను తిరస్కరించి కాంగ్రెస్‌ను ఆశీర్వదించాలన్నారు. రేవంత్ రెడ్డికి శుభం పలుకుతూ… కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానని ముగించారు.