కర్ణాటక ఫలితాలపై స్పందించిన రేవంత్ రెడ్డి

కర్ణాటక ఫలితాలే తెలంగాణలో వస్తాయి..రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌ః కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించబోతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఫలితాలు కర్ణాటకకే పరిమితం కాదని… దేశ రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకొస్తాయని చెప్పారు. కర్ణాటక ఫలితాలు తెలంగాణలో కూడా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి 125 సీట్లు వస్తాయని తాను ఇంతకు ముందే చెప్పానని అన్నారు. బిజెపి మతతత్వ రాజకీయాలను ప్రజలు తిరస్కరించారని చెప్పారు.

బిజెపి ఇప్పటి వరకు తొమ్మిది రాష్ట్రాల్లో సొంతంగా గెలవకుండా ఫిరాయింపుల మీద ఆధారపడి అధికారాన్ని చేపట్టిందని విమర్శించారు. ఫిరాయింపులు, పార్టీలను చీల్చడం బిజెపికి ఉన్న అలవాటని దుయ్యబట్టారు. కర్ణాటక విజయానికి సంబంధించిన క్రెడిట్ రాహుల్ గాంధీదా? లేక ప్రియాంకాగాంధీదా? అనే ప్రశ్నకు బదులుగా… ఇది కాంగ్రెస్ పార్టీ విజయమని సమాధానమిచ్చారు. పూర్తి ఫలితాలు వచ్చిన తర్వాత స్పందిస్తానని చెప్పారు.