కూలిన కపిలతీర్థం మంటపం..

తిరుమలలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత నాల్గు రోజులుగా అతి భారీ వర్షాలు కురవడం తో తిరుమల కొండచరియలు విరిగిపడ్డాయి. ఇదే సమయంలో తిరుమల కొండపై నుంచినీటి ప్రవాహం కొనసాగుతుండడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. జలపాతం నుంచి భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. నీటి ప్రవాహం ధాటికి కపిల తీర్థంలో పురాతన మంటపం కూలిపోయింది.

రెండు మూడు రోజులుగా కొద్దికొద్దిగా కూలుతున్న మంటపం.. తాజాగా ఒక్కసారిగా పడిపోయింది. కపిల తీర్థంలోకి భక్తులు ఎవరినీ అనుమతించడం లేదు టీటీడీ అధికారులు. మంటపం పునర్నిర్మించడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. వరద ప్రవాహం అదుపులోకి వచ్చిన తర్వాతే పనులు ప్రారంభం అవుతాయి. కపిలతీర్థం శేషాద్రికొండ దిగువన, ఏడుకొండలకు వెళ్ళే దారిలో ఉంది. దీనినే చక్రతీర్థం లేదా ఆళ్వార్ తీర్థం అని కూడా పిలుస్తారు. కృతయుగములో పాతాళలోకంలో కపిలమహర్షి పూజించిన కపిలేశ్వరస్వామి, ఏవో కారణాలవల్ల, భూమిని చీల్చుకొని, ఇక్కడ వెలిసినట్లుగా చెప్తారు. అందువల్ల ఇది కపిలలింగంగా పేరొందింది. తిరుపతికి ఉత్తరంగా, తిరుపతి కొండలకు ఆనుకుని అలిపిరి దిగువకు వెళ్తే మనోహరమైన ఈ తీర్థం కనిపిస్తుంది.