కాళోజీ కొడుకు రవి కుమార్ కన్నుమూత

ప్రజాకవి కాళోజీ నారాయణరావు కుమారుడు రవి కుమార్ (68) ఆదివారం కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. కాళోజీకి రవి కుమార్ ఒక్కరే సంతానం. హనుమకొండ జిల్లా నక్కలగుట్టలో నివాసం ఉంటున్న రవి కుమార్ ఆంధ్రా బ్యాంకులో క్లర్కుగా పనిచేసి వీఆర్ఎస్ తీసుకున్నారు. ఆయనకు భార్య వాణి, కుమారుడు సంతోష్ ఉన్నారు.

తెలంగాణ పోరాట యోధుడు.. నిజాం నిరంకుశ పాలనపై కలం ఎక్కుపెట్టిన ప్రజాకవి, స్వతంత్ర సమరయోధుడు, పద్మవిభూషన్ అవార్డు గ్రహీత కాలోజీ నారాయణరావు. తన కలంతో కోట్లమంది తెలంగాణ ప్రజల్లో పోరాట స్ఫూర్తిని నింపారు. మన నీరు, మన భూమి, మన పాలన మనకే కావాలే.. అంటూ ఎంతోమంది తెలంగాణ వీరులను మేల్కొలిపారు… తెలంగాణ సాధనకు ఆజ్యం పోశారు. అలాంటి గొప్ప కవి జయంతి తెల్లారే ఆయన కుమారుడు రవి కుమార్ చనిపోవడం అందర్నీ శోకసంద్రంలో పడేస్తుంది. నేడు రవి కుమార్ అంత్యక్రియలు పద్మాక్షి చెరువు సమీపంలోని శివ ముక్తిస్థల్‌లో జరగనున్నాయి.