కాకతీయ 22వ యువరాజుకు తెలంగాణ మంత్రులు ఘనస్వాగతం

వరంగల్‌లో ఏడు రోజుల పాటు ‘కాకతీయ వైభవ సప్తాహం’ వేడుకలు అట్టహాసంగా జరిపేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఈరోజు నుండి ఈ నెల 13 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలను ప్రారంభించేందుకు కాకతీయ 22వ యువరాజు కమల్​చంద్ర భంజ్​దేవ్ వరంగల్ కు చేరుకున్నారు. ఈ సందర్బంగా మంత్రులు శ్రీనివాస్​గౌడ్​, ఎర్రబెల్లి దయాకర్​ రావు, సత్యవతి రాఠోడ్​లు కమల్​చంద్ర భంజ్​దేవ్​కు ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత ఆయన హన్మకొండ లోని శ్రీ భద్రకాళి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. మొట్టమొదటిసారి ఆలయానికి వచ్చిన ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి ఆశీర్వచనాలు అందించారు.

ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని కమల్​చంద్ర భంజ్​దేవ్​ తెలిపారు. ఓరుగల్లు కోటలో నేటి నుంచి వారం పాటు జరగనున్న కాకతీయ వైభవ సప్తాహాన్ని కమల్‌చంద్ర ప్రారంభించనున్నారు. అనంతరం వేయిస్తంభాల దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. పద్మాక్షీ గుట్ట, కాకతీయ తోరణాన్ని సందర్శించనున్నారు. వేడుకలను పురస్కరించుకుని విద్యార్థులకు నాటకాలు, సదస్సులు, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నారు.