‘కైకాల’ ఆరోగ్య పరిస్థితి విషమం

సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ (88) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గత కొన్ని రోజుల క్రితం కైకాల సత్యనారాయణ ఇంట్లో కాలు జారిపడగా… సికింద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అనంత‌రం కోలుకుని డిశ్చార్జ్ కూడా అయ్యారు. ఇప్పుడు మ‌ళ్లీ ఆయ‌న ఆరోగ్యం తిర‌గ‌బ‌డింద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఆయ‌న్ని అపోలో ఆసుప‌త్రిలో చేర్చారు. ఆయ‌న ప‌రిస్థితి కాస్త ఆందోళ‌న కరంగా ఉంద‌ని స‌మాచారం అందుతోంది. సత్యనారాయణ కోలుకోవాలని పలువురు నటీనటులు, అభిమానులు కోరుకుంటున్నారు.

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో 1935 జూలై 25న జన్మించిన కైకాల..1959 లో సిపాయి కూతురు మూవీ తో వెండి తెరపై అడుగు పెట్టారు కైకాల. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు ఇలా ఏ పాత్రలో నటించినా ఆ పాత్రకు జీవం పోసి.. నవరస నట సార్వభౌమగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఖ్యాతిగాంచారు. తనదైన నటనలో అభిమానులను అలరించడమే కాదు.. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు. గత 60 ఏళ్లుగా సినీ రంగంలో ఉన్న కైకాల గత కొంతకాలం క్రితం వరకూ తండ్రి, తాత పాత్రలను పోషించారు. సుదీర్ఘ సినీ కెరీర్ లో సుమారు 777 సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించారు