షర్మిలకు కడియం శ్రీహరి ఉచిత సలహా

YSRTP అధ్యక్షురాలు వైస్ షర్మిల కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఉచిత సలహా ఇచ్చారు. తెలంగాణ బడ్జెట్ ఫై షర్మిల సెటైర్లు వేయడం ఫై కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. తెలంగాణ బడ్జెట్‌పై షర్మిల మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. తెలంగాణకు వైఎస్ కుటుంబం ఫస్ట్ నుండి వ్యతిరేకమేనని.. సమైక్యాంధ్ర నినాదంతో షర్మిల ఊరూరా తిరిగారని మండిపడ్డారు. అలాంటి వారు తెలంగాణ సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మాట్లాడటం బాధగా ఉందని వ్యాఖ్యనించారు.

తెలంగాణలో ఆమె అవసరం లేదని, ఆంధ్రాకు వెళ్లి అక్కడి ప్రజలకు మెురపెట్టుకోవాలని సూచించారు. రేపోమాపో జగన్ జైలుకు పోతే ఏపీలో నీకే అవకాశం వస్తుందని షర్మిలను ఉద్దేశించి వ్యాఖ్యనించారు. 2023-24 ఆర్ధిక సంవత్సరానికి గాను రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి తన్నీరు హరీశ్ రావు సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. 2,90,396 కోట్ల రూపాయల వ్యయాన్ని ప్రతిపాదిస్తూ హరీశ్ రావు బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. కాగా ఈ బడ్జెట్ ఫై YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల సెటైర్లు వేశారు.

‘‘మంత్రి హరీశ్ రావు కొత్త సంవత్సరం కదా అని కొత్త సీసా తీసుకొని ఫామ్ హౌజ్‎కి వెళ్లారు. అందులో ఆయన మామ పాత సారా పోశారు’’ అంటూ షర్మిల ఎద్దేవా చేసారు. గతేడాది బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులపై సమాధానం చెప్పాలని తన పాదయాత్ర లో షర్మిల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బడ్జెట్‌లో కొత్తగా ఏమీ లేదని, గతేడాది బడ్జెట్‎ను కాపీ పేస్ట్ చేశారని, ఈ ఏడాది కేటాయింపులకు న్యాయం చేస్తారని గ్యారెంటీ ఉందా? అని ప్రశ్నించారు. అసలు కేటాయింపులకు, ఖర్చులకు పొంతనే లేదని విమర్శించారు. పథకాలకు బడ్జెట్ కేటాయించి ఖర్చు పెట్టకపోతే ఎందుకని నిలదీశారు. 8 ఏళ్లుగా ముఖ్యమంత్రి ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకోలేదని విమర్శించారు. సీఎం ఇచ్చిన మాటకు విలువ ఉండదా? అని ప్రశ్నించారు.