మిర్యాలగూడ ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు

మిర్యాలగూడ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. మంగళవారం దామరచర్ల మండలంలోని నర్సాపూర్ గ్రామంలో పర్యటించిన ఆయన..సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నా ప్రతిపక్షాలు విమర్శలు చేయడాన్ని తప్పుపట్టారు. అలా విమర్శించే వారు కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తీసుకోవద్దని.., బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన రోడ్లపై నడవరాదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

“తిని సున్నం బొట్లు పెడితే సరికాదు. ఆ దేవుడనేవాడు ఉన్నడు. కల్లేపల్లి మైసమ్మ ఉంది. మీ అందరి సంగతి ఆ కల్లేపల్లి మైసమ్మ చూస్తది. మీరంతా ఓ పని చేయండి. వేరే పార్టీవాడెవడూ మా రోడ్డు మీద నడవకండి. కేసీఆర్ వేసిన రోడ్డు మీద నడవొద్దు, కేసీఆర్ ఇచ్చే రైతు బంధు తీసుకోవద్దు, కేసీఆర్ ఇచ్చే పెన్షన్ తీసుకోవద్దు, కేసీఆర్ ఇచ్చే కల్యాణ లక్ష్మీ తీసుకోకుండా ఉండండి. ఇవన్నీ తీసుకుంటాం.. మా డ్యాన్స్ మేం చేస్తాం అనే ఆలోచన గనుక మీకు ఉంటే.. నేను కూడా డ్యాన్స్ చేపిస్తా. నా సంగతి మీకు తెలియదు. మర్యాదగా ఉంటే మర్యాదగానే ఉంటా. మర్యాద తప్పితే మాత్రం ఐదు నిమిషాల్లో ఎట్ల చేపించాల్నో అట్ల డ్యాన్స్ చేపిస్తా. మీ నర్సాపూర్‌తోనే నాకేదో అయితదని మీరనుకుంటున్నరు. మీతోని ఏమీ కాదు.” అని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఈయన చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయటమేంటని మండిపడుతున్నారు. కాగా.. ఎమ్మెల్యే వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.