తెలంగాణ అసెంబ్లీలో కడియం, శ్రీధర్ బాబు వాగ్వాదం

కోరం లేకుండా సభను పెట్టడం సరికాదన్న హరీశ్, కడియం

కోరంకు సరిపడా సభ్యులు ఉన్నారన్న శ్రీధర్ బాబు

Kadiam, Sridhar Babu quarrel in Telangana Assembly

హైదరాబాద్ః తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. ఓటాన్ అకౌంట్ పై చర్చ జరుగుతోంది. అయితే, ఉదయం సభ ప్రారంభమైన తర్వాత… సభలో కోరం లేదంటూ బిఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కోరం లేకుండా సభను పెట్టడం సరికాదని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, హరీశ్ రావు కడియం శ్రీహరి అన్నారు. అయితే, పది శాతం మంది సభ్యులు ఉంటే కోరం సరిపోతుందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. అన్నీ తెలిసినా హరీశ్ రావు బుల్డోజ్ చేస్తున్నారని విమర్శించారు. తమ పార్టీ తరపున సరైన సంఖ్యలో సభ్యులు ఉన్నారని చెప్పారు.

మరోవైపు బిఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… సభ నిర్వహణకు తాము సహకరిస్తున్నామని తెలిపారు. అధికార పార్టీ సభ్యులను తాము అప్రమత్తం చేస్తున్నామని అన్నారు. కడియం శ్రీహరి మాట్లాడుతూ… బడ్జెట్ పై చర్చ జరుగుతుంటే సీఎం, డిప్యూటీ సీఎం సభలో లేరని విమర్శించారు. కాళేశ్వరం విషయంలో గోరంతను కొండంత చేయొద్దని చెప్పారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దని అన్నారు. కాళేశ్వరం ద్వారా అనేక రిజర్వాయర్లు వచ్చాయని… నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకున్నామని చెప్పారు.

డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారని… ఇంకా ఎప్పుడు చేస్తారని కడియం శ్రీహరి ప్రశ్నించారు. కాంగ్రెస్ హామీలకు ఏడాదికి రూ. 1.36 లక్షల కోట్లు అవసరమని చెప్పారు. ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేస్తామని బడ్జెట్ లో చెప్పారని… 119 నియోజకవర్గంలో 4.16 లక్షల ఇళ్లకు రూ. 24 వేల కోట్లు అవసరమని… కానీ, బడ్జెట్ లో కేవలం రూ. 7 వేల కోట్లే కేటాయించారని విమర్శించారు.