హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్

Junior NTR filed a petition in the High Court

హైదరాబాద్‌ః తన ఇంటి స్థలం వివాదానికి సంబంధించి స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. వివరాల్లోకి వెళ్తే… జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో ఉన్న 681 చదరపు గజాల స్థలం విషయంలో వివాదం నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్ చెపుతున్న వివరాల ప్రకారం… 2003లో సుంకు గీత అనే మహిళ నుంచి ఈ స్థలాన్ని ఆయన కొనుగోలు చేశారు. చట్టప్రకారం అన్ని అనుమతులను పొందిన తర్వాత ఏడాది క్రితం ఆ స్థలంలో ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు.

అయితే, ఆ భూమిని ఎన్టీఆర్ కు అమ్మిన వ్యక్తులు 1996లోనే దాన్ని తమ వద్ద తనఖా పెట్టి రుణం పొందారని ఎస్బీఐ, ఇండస్ ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ బ్యాంకులు డెట్ రికవరీ ట్రైబ్యునల్ ను ఆశ్రయించాయి. దీనిపై విచారణ జరిపిన ట్రైబ్యునల్ బ్యాంకులకు అనుకూలంగా తీర్పును వెలువరించింది. ఆ స్థలంపై బ్యాంకులకే హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో, తనకు స్థలాన్ని విక్రయించిన సుంకు గీతపై పోలీస్ స్టేషన్ లో జూనియర్ ఎన్టీఆర్ ఫిర్యాదు చేశారు. దీంతో, ఆమెపై కేసు నమోదయింది. మరోవైపు, ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై జస్టిస్ జే శ్రీనివాసరావు, జస్టిస్ సుజోయ్ పాల్ ధర్మాసనం నిన్న విచారణ చేపట్టింది. ట్రైబ్యునల్ ఆర్డర్ కాపీ అందుబాటులో లేకపోవడంతో… తమకు సమయం కావాలని ఎన్టీఆర్ తరపు న్యాయవాది హైకోర్టును కోరారు. తదుపరి విచారణను వెకేషన్ బెంచ్ ముందు పోస్ట్ చేయాలని ఎన్టీఆర్ న్యాయవాది కోరగా ధర్మాసనం తిరస్కరించింది. జూన్ 6కు తదుపరి విచారణను వాయిదా వేసింది. కేసుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను జూన్ 3లోగా అందజేయాలని ఆదేశించింది.