ఆస్ట్రేలియా నూతన ప్రధానిగా ఆల్బనీస్ ప్రమాణం‌

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియా నూతన ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్‌ బాధ్యలు స్వీకరించారు. సోమవారం ఉదయం కాన్‌బెర్రాలో సాదాసీదాగా జరిగిన కార్యక్రమంలో 31వ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. నిరాడంబరంగా జరిగిన ప్రమాణ స్వీకార వేడుకల్లో.. ఆల్బనీస్‌తోపాటు విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌, ట్రెజరర్‌ జిమ్‌ చామర్స్‌, ఆర్థిక మంత్రి కాటీ గల్లాఘర్‌ బాధ్యతలు స్వీకరించారు.

ఆస్ట్రేలియా పార్లమెంట్‌లోని 151 స్థానాలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. శనివారం ఓట్లు లెక్కించగా.. మాజి ప్రధాని స్కాట్‌ మారిసన్‌ నేతృత్వంలోని లిబరల్‌-నేషనల్‌ కూటమికి 51 స్థానాలు మాత్రమే దక్కాయి. ఆంటోనీ పార్టీ 72 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. అయితే అధికారం చేపట్టేందుకు సింగిల్‌ పార్టీకి స్పష్టమైన మెజార్టీ (76) రాకపోయినా.. స్వతంత్రులుగా ఎన్నికైన వారి మద్దతుతో ఆంటోనీ ఆల్బనీస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

కాగా, ప్రధానిగా ఆంటోనీ ఆల్బనీస్‌ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఆయన జపాన్‌లోని టోక్యోకు పయణమయ్యారు. మంగళవారం నుంచి టోక్యోలో క్వాడ్‌ సదస్సు జరుగుతున్నది. ఈ సందర్భంగా ఆయన భారత ప్రధాని మోడీ, అమెరికా, జపాన్‌ అధినేతలతో సమావేశం కానున్నారు. వాతావరణ మార్పులపై ప్రపంచంతో చర్చించేందుకు ఆస్ట్రేలియా సుముఖంగా ఉందని ఆల్బనీస్‌ వెల్లడించారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/