జూబ్లీహిల్స్ వన్ డ్రైవ్ కేసు : బాత్‌రూమ్‌ సీక్రెట్ కెమెరాలో 20 కి పైగా వీడియోలు

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ‘వన్ డ్రైవ్’ రెస్టారెంట్ బాత్రూంలో స్పై కెమెరా ఉదంతంలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. రెస్టారెంట్‌ లెడీస్‌ బాత్‌రూమ్‌లో సీసీ కెమెరాను ఓ యువతి గుర్తించింది. వెంటనే యువతి ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఈ కేసుకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు చైతన్య, బెనర్జీ నివాసాల్లో సోదాలు చేశారు. బెనర్జీ అమర్చిన సీక్రెట్ ఫోన్లో 5 గంటల డేటా ఉందని, సుమారు 20 మంది యువతులు నగ్న దృశ్యాలు లభించినట్లు తెలుస్తోంది. దీంతో అతడిపై నిర్భయ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన వెలుగులోకి రాగానే ఇటీవల ఆ హోటల్‌కు వెళ్లిన పలువురు మహిళలు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలివస్తున్నారు. తమకు సంబంధించిన వీడియోలు బయటకు రాకుండా చూడాలని పోలీసులను కోరుతున్నారు. ఈ కేసుకు సంబంధించి రెస్టారెంట్‌లో పనిచేస్తున్న బెనర్జీ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెనర్జీ రెస్టారెంట్‌లో హౌస్‌కీపర్‌గా పనిచేస్తున్నాడు. హౌస్‌కీపర్‌ బెనర్జీ మైనర్ కావడం గమనార్హం. అతనే స్పై క్యామ్ పెట్టినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. బాత్‌రూమ్‌లో ఆరు నెలలుగా ఫోన్ అమర్చినట్లు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, అతడు ఫోన్ కొని నాలుగు రోజులే అవుతోందని పేర్కొన్నారు.