ఏపీలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయం – జేపీ నడ్డా

ఆంధ్రప్రదేశ్ లో బిజెపి పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. మంగళవారం రాజమండ్రి లో జరిగిన బీజేపీ గోదావరి గర్జన సభ లో నడ్డా పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..తెలుగు సంస్కృతికి ఈ ప్రాంతం ప్రతిబింబంగా ఉందన్న ఆయన.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. మోడీ హయాంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని జేపీ నడ్డా అన్నారు. మోడీ అవినీతి రహిత పాలనను అందిస్తున్నారన్న ఆయన.. ముందుతో పోలిస్తే పేదరికం తగ్గిందని తెలిపారు. దేశ సంస్కృతిని మోడీ మారుస్తున్నారని, ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్ కవరేజ్ అయిన ఆయుష్మాన్ భవ కార్యక్రమం ద్వారా కోట్లాది మందికి సాయం చేస్తున్నారని నడ్డా అన్నారు. 2014-20 మధ్య దేశ ఆదాయం చూస్తే రెండింతలైందని… అంతే కాకుండా దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు బీజేపీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. . అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ ద్వారా కరోనాను నియంత్రించారని నడ్డా ఈ సందర్భంగా గుర్తు చేశారు.

రాష్ట్రం నుండి వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాలని, బీజేపీకి అధికారం ఇవ్వాలని ప్రజలు భావిస్తున్నారన్నారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. 2014కు ముందు చాలా ప్రాంతాల్లో కరెంట్, విద్య, వైద్యం ఉండేది కాదని చెప్పారు. అవినీతి అంటే జీవితంలో భాగం కాదని ప్రధాని అన్నారని జేడీ నడ్డా పేర్కొన్నారు. మోడీ వల్ల రాజకీయాల్లోనూ పెను మార్పులు చోటు చేసుకున్నాయని అన్నారు. మణిపూర్, గోవా, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో బీజేపీ సాధించిన విజయమే నిదర్శనమని గొప్పగా చెప్పారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు కూడా చరమగీతం పాడామని జేపీ నడ్డా వివరించారు.

ఇక ఇదే సభ లో కాంగ్రెస్ పార్టీ బిగ్ షాక్ తగిలింది. పీసీసీ కార్యదర్శిగా ఉన్న డాక్టర్ పెనుబాల చంద్రశేఖర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి నల్లందుల మోహన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. బిజెపి నేత జేపీ నడ్డా స‌మ‌క్షంలో వారు కాషాయ కండువా క‌ప్పుకున్నారు. దేశాన్ని ప్రధాని మోదీ అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నార‌ని, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీలో చేరిన‌ట్టు వారు తెలిపారు.