అవసరమైతే కొత్త రాజకీయ పార్టీ పెడతాః జేడీ లక్ష్మీనారాయణ

వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచే పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన లక్ష్మీనారాయణ

JD Lakshminarayana will contest the next elections from Visakhapatnam

అమరావతిః అవసరమైతే కొత్త రాజకీయ పార్టీని స్థాపించాలనే ఆలోచన తనకు ఉందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. రానున్న ఎన్నికల్లో తాను మరోసారి విశాఖ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. బోగస్ ఓట్లను కచ్చితంగా తొలగించాల్సిందేనని అన్నారు. నిజమైన ఓట్లను తొలగిస్తుండటంపై ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని చెప్పారు. విశాఖలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

డిసెంబర్ 2న జేడీ ఫౌండేషన్, నిపుణ హ్యూమన్ డెవలప్ మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ మేళాలో 50కి పైగా కంపెనీలు పాల్గొంటాయని చెప్పారు. సెలెక్ట్ అయిన వారికి అక్కడికక్కడే ఆఫర్ లెటర్లను ఇస్తామని వెల్లడించారు. పదో తరగతి, ఆపై విద్యార్హత ఉన్నవారు జాబ్ మేళాకు హాజరు కావచ్చని చెప్పారు. కొంచెం వెనుకబడిన అభ్యర్థులకు స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ ను నిర్వహిస్తామని తెలిపారు.