బిజెపిలో చేరిన గాలి జనార్దన్ రెడ్డి

Gali Janardhan Reddy joined BJP

బెంగళూరుః లోక్ సభ ఎన్నికలకు ముందు కర్ణాటక రాజీకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి తన సొంత గూడు బిజెపిలోకి చేరారు. తన పార్టీ కల్యాణ రాజ్య ప్రగతి పక్ష (కేఆర్పీపీ)ని బిజెపిలో విలీనం చేశారు. మాజీ ముఖ్యమత్రి యడియూరప్ప సమక్షంలో తన పార్టీని బిజెపిలో కలిపారు. ఆయనతో పాటు ఆయన భార్య కూడా బిజెపి కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా గాలి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ… తన పార్టీని బీజేపీలో విలీనం చేశానని, బిజెపిలో చేరానని తెలిపారు. నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానిని చేసేందుకు ఒక బిజెపి కార్యకర్తగా తాను పని చేస్తానని చెప్పారు. ఎలాంటి షరతులు లేకుండానే తాను బిజెపిలో చేరానని, తనకు ఎలాంటి పదవులు అవసరం లేదని అన్నారు.

యడియూరప్ప మాట్లాడుతూ… గాలి జనార్దన్ రెడ్డి, ఆయన భార్య బిజెపిలో చేరారని… ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. గాలి చేరిక బిజెపిని మరింత బలపరుస్తుందని అన్నారు. రాష్ట్రంలోని మొత్తం 28 లోక్ సభ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.