నిమ్మగడ్డ ఉన్నంత వరకు ఎన్నికలు కష్టమే..జేసీ

పంచాయతీ ఎన్నికల ఆలస్యం వెనుక ఎత్తుగడ ఉందన్న జేసీ

J. C. Diwakar Reddy
J. C. Diwakar Reddy

అమరావతి: మాజీ ఎంపి జేసీ దివాకర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల వ్యవహారం తీవ్రస్థాయిలో రగులుకోవడంపై జేసీ స్పందించారు. పంచాయతీ ఎన్నికలను ప్రభుత్వం అడ్డుకోవడం వెనుక లోతైన వ్యూహం ఉందని అన్నారు. జస్టిస్ కనగరాజ్ ను ఎన్నికల కమిషనర్ గా నియమించుకుని, స్థానిక ఎన్నికలను ఏకగ్రీవం చేసుకునే ఎత్తుగడ వేశారని, అందుకే ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలను ఆలస్యం చేస్తోందని వివరించారు. ఆ లెక్కన చూస్తే ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఉన్నంత కాలం స్థానిక ఎన్నికలు జరిగేది కష్టమని అభిప్రాయపడ్డారు. తాము కోరుకున్న కనగరాజ్ ఎన్నికల కమిషనర్ గా వస్తే తమ అభీష్టం ప్రకారం ఎన్నికలు జరుపుకుంటుందని వైఎస్‌ఆర్‌సిపి సర్కారుపై ఆరోపణలు చేశారు. ఇంతకుముందు ఏకగ్రీవమైన స్థానాలు చెల్లుబాటు అవుతాయని కనగరాజ్ తో ఆదేశాలు ఇప్పిస్తారని వెల్లడించారు.

ఇకపై ఎస్ఈసీ నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ లకు అధికారులు హాజరయ్యేది అనుమానమేనని, వారు ఏదో ఒక సాకు చెప్పి సమావేశాలకు దూరంగా ఉండే అవకాశాలున్నాయని జేసీ వివరించారు. ఒకవేళ ఎన్నికలు వస్తే విపక్ష అభ్యర్థులను పోలీసు బలంతో బెదిరించి నామినేషన్లు వెనక్కి తీసుకునేలా చేస్తారని అన్నారు. ప్రజల్లో తమపై అభిమానం ఉన్నా, ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు ఏకపక్షంగానే జరుగుతాయని, స్థానిక సంస్థల ఎన్నికల్లో విపక్షాలు బరిలో దిగకపోవడమే మంచిదని జేసీ పేర్కొన్నారు. ఒకవేళ గెలిచినా ఏదో ఒక ఆరోపణ మోపి పోలీసు కేసు నమోదు చేస్తారని తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/