అమరావతి రైతుల పాదయాత్రకు జనసేన మద్దతు

అమరావతి రైతుల పాదయాత్రకు జనసేన మద్దతు ప్రకటించింది. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రైతులకు మద్దతుగా జనసేన పార్టీ నాయకులు సంఘీభావం తెలపనున్నారు. నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో జనసేన నాయకులు నెల్లూరు జిల్లాల్లో జరుగుతున్న పాదయాత్రలో కలుసుకుని వారికి అండగా నిలవనున్నారు. ఈ నెల 26వ తేదీన జనసేన పార్టీ ముఖ్య నేతలు రాజధాని రైతుల మహాపాదయాత్ర లో పాల్గొననున్నట్టు జనసేన పార్టీ అధికారికంగా ప్రకటన చేసింది. నెల్లూరు జిల్లాలో రాజధాని రైతులతో కలిసి జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ సంఘీభావం తెలపనున్నట్లు స్పష్టం చేసింది.

ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనేకసార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా అమరావతి నగరమే ఉంటుందని, అమరావతి మార్చేది లేదని ప్రకటించారు. రాజధాని రైతుల పోరాటానికి తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు. ప్రస్తుతం పాదయాత్ర గుంటూరు, ప్రకాశం జిల్లాలను దాటుకొని నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. ఇప్పటికే రైతులు నిర్వహిస్తున్న మహా పాదయాత్రకు తెలుగుదేశం పార్టీ తమ మద్దతును ప్రకటించింది. అమరావతి రైతుల పక్షాన తాము కూడా పోరాటం సాగిస్తామని తేల్చి చెబుతోంది.