కొడాలి నాని ఇంటివద్ద ఆందోళన చేసిన జనసేన కార్యకర్తలు

ఏపీలో రోడ్ల పరిస్థితి ఫై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం గుడ్ మార్నింగ్ సీఎం సార్ ట్యాగ్ తో డిజిటల్ క్యాంపెనింగ్ స్టార్ట్ చేసారు. నేటితో సీఎం జగన్ రోడ్లను మరమ్మత్తులు చేయడానికి విధించిన డెడ్లైన్ ముగియడంతో రాష్ట్రంలో రోడ్ల అధ్వాన్నమైన పరిస్థితిని తెలియజేస్తూ వీడియోలను, ఫోటోలను పోస్ట్ చేస్తూ జనసేన నాయకులు, కార్య కర్తలు , అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.

ఈ క్రమంలో కృష్ణాజిల్లా గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని రోడ్లను బాగు చేయించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇప్పటికైనా మరమ్మత్తులు చేయించాలని డిమాండ్ చేస్తూ నాని ఇంటిని ముట్టడించడానికి జనసేన పార్టీ శ్రేణులు ప్రయత్నం చేశారు. అయితే వైసీపీ శ్రేణులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో నాని ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనసేన నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. కొడాలి నాని ఇంటికి వెళ్లే ప్రధాన రహదారిలోనే రోడ్డుపై బైఠాయించిన జనసేన పార్టీ నేతలు ధర్నా నిర్వహించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో రోడ్ల దుస్థితి ఈ విధంగా ఉంటే మొద్దు నిద్ర పోతున్నారని, ఇప్పటికైనా ఆయన మేల్కోవాలి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఉదయం నుండి కూడా పవన్ పిలుపు మేరకు సోషల్ మీడియాలో ఏపీ వ్యాప్తంగా అనేక జిల్లాలలో రోడ్ల దుస్థితి పై ప్రజలు వినూత్నంగా ఆందోళనలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.