తుంగభద్ర జలాశయానికి భారీగా పెరుగుతున్న వరద

తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు వ‌చ్చి చేరుతోంది. దీంతో 30 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్ ఫ్లో 1,32,365 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 1,58,400 క్యూ సెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 105 టీఎంసీలకు గాను.. ప్రస్తుతం నీటి నిల్వ 94.514 టీఎంసీలుగా కొనసాగుతోంది. అలాగే శ్రీశైలంకు కూడా భారీగా వరద పోటెత్తుంది.

జలాశయం ఇన్ ఫ్లో 3 లక్షల 67 వేల 698 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 12 వేల 714 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా… ప్రస్తుతం 848.30 అడుగులకు చేరింది. ఇక భద్రాచలం వద్ద గోదావరి వరద ఉదృతి కాస్త తగ్గినప్పటికీ..ముంపు గ్రామాలు మాత్రం నీటిలో ఉండిపోయాయి. ప్రస్తుతం గోదావరి 70.90 అడుగుల వద్ద ప్రవహిస్తుంది. వరద ప్రవాహం 24,24,000 క్యూసెక్కులకు చేరుకుంది. 71.30 అడుగుల నుంచి 70.90 నీటిమట్టం అడుగులకు తగ్గింది. ఎగువ నుంచి వరద తగ్గడంతో భద్రాచలం వద్ద గోదావరి శాంతిస్తోంది.