జమ్ముకశ్మీర్‌కు రూ.1350 కోట్ల ఆర్థిక ప్యాకేజీ

jammu-and-kashmir-l-g-manoj-sinha-announces-rs-1350-crore-economic-package-for-ut

శ్రీనగర్‌: జ‌మ్ముక‌శ్మీర్ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ మ‌నోజ్ సిన్హా నేడు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రపాలిత ప్రాంతం జ‌మ్ముక‌శ్మీర్ అభివృద్ధికి రూ. 1350 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్ర‌క‌టించారు. వ్యాపార వ‌ర్గాలు సంక్షోభం ఎదుర్కొంటున్న ప్ర‌స్తుత త‌రుణంలో ఆర్థిక ప్యాకేజీ ప్ర‌క‌ట‌న త‌న‌కెంతో సంతోషంగా ఉంద‌న్నారు. ఆత్మ నిర్బ‌ర భార‌త్‌, ఇత‌ర ప్యాకేజీల‌తో పాటు వ్యాపార వ‌ర్గాల సౌల‌భ్యం కోసం అందిస్తున్న ఈ ఆర్థిక ప్యాకేజీ అద‌నం అని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యాపార వ‌ర్గాల‌కు ఆరు నెల‌లు ఎటువంటి ష‌ర‌తులు లేకుండా ప్ర‌తీ రుణ గ్ర‌హీత‌కు 5 శాతం వ‌డ్డీ స‌బ్సిడీ ఇచ్చేందుకు నిర్ణ‌యించిన‌ట్లు చెప్పారు.

ఈ చ‌ర్య వ్యాపారుల‌కు భారీ ఉప‌శ‌మ‌నం క‌లిగించ‌డంతో పాటు స్థానికంగా ఉపాధి క‌ల్ప‌న‌కు సహాయ‌ప‌డుతుంద‌న్నారు. చేనేత, హస్తకళల రంగాన్ని ప్రోత్సహించే నిమిత్తం క్రెడిట్ కార్డ్ పథకం కింద ఆయా పరిశ్రమలో పనిచేసే వ్యక్తులకు ఇచ్చే రుణాన్ని గరిష్టంగా రూ .1 లక్ష నుండి రూ. 2 లక్షలకు పెంచాలని నిర్ణయించిన‌ట్లుగా అదేవిధంగా వారికి 7 శాతం వడ్డీ స‌బ్సిడీ సైతం ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. అక్టోబర్ 1 నుండి జమ్ముక‌శ్మీర్ బ్యాంక్ యువత, మహిళా వ్యాపారుల కోసం ప్రత్యేక డెస్క్ ప్రారంభిస్తుందని సిన్హా వెల్ల‌డించారు.


తాజా తెలంగాణా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/